భారత నేవీ అధికారులకు కతార్ కోర్టు ఉరిశిక్ష విధించడం సంచలనంగా మారింది. కోర్టు తీర్పుపై భారత్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. గత ఏడాది ఆగష్టులో భారత్‌కు చెందిన 8 మంది నేవీ మాజీ అధికారులను గూఢచర్యం కింద కతార్ (Qatar) అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి వారిని జైల్లో బందించారు. కతార్ కోర్టు నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది.
గత ఆగష్ట్‌లో అరెస్టైన వారిలో భారత నావికాదళానికి చెందిన మాజీ కమాండర్లు పూర్ణేందు తివారీ, సుగుణాకర్ పాకాల, అమిత్ నాగ్‌పాల్, సంజీవ్ గుప్తా, కెప్టెన్లు నవతేజ్ సింగ్‌గిల్,బీరేంద్ర కుమార్ వర్మ, సౌరభ్ వశిష్ట్, సైనికుడు రాగేష్ ఉన్నారు. వీరంతా భారత నేవీలో 20 సంవత్సరాలుపైగా పనిచేశారు. నేవీలో ముఖ్యమైన పదవులు చేశారు.
కమాండర్ పూర్ణేందు తివారీ 2019 భారత అత్యున్నత పురస్కారమైన ప్రవాసీ భారతీయ సమ్మాన్ అందుకున్నారు.విదేశాల్లో భారతదేశ ప్రతిష్ఠను పెంచినందుకు ఈ అవార్డు ఇచ్చినట్లు దోహాలోని భారత రాయబార కార్యాలయం అప్పట్లో పేర్కొంది.
వీరు కతార్‌లో ఏమి చేస్తున్నారు?
మొత్తం 8 మంది నేవీ మాజీ అధికారులు దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అనే ప్రైవేటు సంస్థలో పనిచేశారు. ఆ సంస్థ కతార్ సాయుధ దళాలకు శిక్షణ అందిస్తోంది.ఆ సంస్థ ఒమన్ ఎయిర్ ఫోర్స్ మాజీ స్క్వాడ్రన్ లీడర్ ఖమీస్ అల్ అజ్మీ ఆధ్వర్యంలో నడుస్తోంది. భారత నేవీ అధికారులతోపాటు అజ్మీని కూడా గత ఆగష్టులోనే అరెస్ట్ చేశారు. ఆ తరవాత విడుదల చేశారు. మరణశిక్ష పడ్డ అధికారులు చాలా సున్నితమైన ఇటాలియన్ టెక్నాలజీ ఆధారిత మిడ్‌గెట్ జలాంతర్గాములకు చెందిన ప్రాజెక్టులో పనిచేస్తున్నారు. గత మేలో అల్ దహ్రా గ్లోబల్ దోహాలోని తన కార్యకలాపాలను నిలిపేసింది.అక్కడ పనిచేస్తున్న భారతీయులంతా తిరిగి స్వదేశానికి చేరుకున్నారు.
గత ఏడాది ఆగష్టులో భారత నేవీ అధికారులను అరెస్ట్ చేసిన కతార్, ఈ ఏడాది మార్చి 25న గూఢచర్యం కింద అభియోగాలు మోపింది. కతార్ చట్టాల ప్రకారం వారిని విచారించారు. భారత నేవీ అధికారులు పెట్టుకున్న బెయిల్ పిటిషన్లు చాలా సార్లు తిరస్కరించారు. గురువారం వారికి మరణశిక్ష విధిస్తూ కతార్‌లోని ఫస్ట్ ఇన్‌స్టాన్స్ కోర్టు తీర్పు చెప్పింది.
ఈ తీర్పుపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ కేసులో తీర్పు పూర్తి వివరాల కోసం ఎదురుచూస్తున్నామని, వారిని విడిపించడానికి అన్ని చట్టపరమైన అవకాశాలను పరిశీలిస్తున్నట్లు విదేశాంగశాఖ తెలిపింది. మరణశిక్ష పడ్డ అధికారులకు అన్ని విధాలైన న్యాయ సహాయం అందిస్తామని విదేశాంగశాఖ ప్రకటించింది.భారత నేవీ మాజీ అధికారులు క్షమాభిక్ష కోరినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా
స్పష్టత రావాల్సి ఉంది.