Shahid Afridi forced me to convert into Islam, claims Danish Kaneria
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ దానిష్ కనేరియా ఓ దిగ్భ్రాంతికర
వాస్తవాన్ని బైటపెట్టాడు. పాకిస్తాన్ క్రికెట్ ఆటగాళ్ళు తన మతం మార్చడానికి
ప్రయత్నించారని వెల్లడించాడు. ఆ పని చేసింది ఏ చిన్న ఆటగాడో కాదు, పాకిస్తాన్
క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా పనిచేసిన షాహిద్ అఫ్రిదీ అని దానిష్ కనేరియా కుండబద్దలుకొట్టాడు.
దానిష్ కనేరియా, పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుకు ఆడిన రెండో హిందూ
ఆటగాడు. అతనికంటె ముందు ఒకే ఒక హిందువు పాక్ క్రికెట్ టీమ్‌లో ఆడాడు. అనిల్ దళపత్
అనే ఆ ఆటగాడు దానిష్ కనేరియాకు సమీపబంధువే కావడం విశేషం. కనేరియా క్రికెట్లో
లెఫ్ట్ స్పిన్ బౌలర్‌గా ఆడాడు. పాకిస్తాన్ టెస్ట్ క్రికెట్లో అతి ఎక్కువ వికెట్లు
తీసిన నాలుగో బౌలర్‌గా రికార్డుకెక్కాడు. 61 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి, 360 వికెట్లు
తీసిన ఘనత అతని సొంతం.
అఫ్రిదీ తనను మతం మార్చడానికి ప్రయత్నించాడని చెప్పిన దానిష్ కనేరియా,
మతంతో సంబంధం లేకుండా ఒక ఆటగాడిగా తనకు అండగా నిలిచిన క్రికెటర్లు కూడా పాక్ జట్టులో
ఉండేవారని చెప్పాడు. ఇంజమామ్ ఉల్ హక్, షోయబ్ అక్తర్ తన మేలు కోరేవారనీ, ఆటలో తనకు
మద్దతు పలికేవారనీ వెల్లడించాడు. భారతదేశానికి చెందిన ఒక న్యూస్ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దానిష్
కనేరియా తన మీద వచ్చిన స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల గురించి కూడా చెప్పుకొచ్చాడు. తనపై
ఆరోపణలను బలవంతంగా ఒప్పుకోవలసి వచ్చిందని వెల్లడించాడు.
‘‘అప్పటికి నా కెరీర్ బాగానే నడుస్తుండేది. దేశవాళీ క్రికెట్ కూడా బాగానే
ఆడేవాణ్ణి. ఇంజమామ్ ఉల్ హక్, షోయబ్ అక్తర్ మాత్రమే నాకు మద్దతుగా నిలిచారు. షాహిద్
అఫ్రిదీ మాత్రం నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. అఫ్రిది, మరికొంతమంది ఆటగాళ్ళు నాతో
కలిసి భోజనం చేసేవారు కాదు. అఫ్రిదీ అయితే నన్ను ఇస్లాంలోకి మతం మార్చడానికి చాలా
ప్రయత్నించాడు’’ అని కనేరియా చెప్పాడు.
‘‘నేను కౌంటీ క్రికెట్ ఆడుతున్న సమయంలో నామీద స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు
చేసారు. నేను ఒక బుకీని కలిసాను. ఆ విషయాన్ని మాత్రమే నేను చెప్పాను. కానీ
మిగతావాళ్ళు నామీద ఒత్తిడి తెచ్చారు. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలను నేను ఒప్పుకునేలా
చేసారు. నేను హిందువుని కాబట్టే పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ నాకు అండగా నిలవలేదు.
నేను ఇంకా ఆడడం కొనసాగిస్తే, వాళ్ళ రికార్డులు బద్దలవుతాయని భయపడ్డారు’’ అని
వివరించాడు.
తన ధర్మం గురించి మాట్లాడుతూ ఈ
పాకిస్తానీ మాజీ స్పిన్నర్ తనకు అన్నిటికంటె సనాతన ధర్మమే మిన్న అని స్పష్టం
చేసాడు. హిందువులపై జరిగే అన్యాయాలకు వ్యతిరేకంగా గళమెత్తడాన్ని కొనసాగిస్తానని
కచ్చితంగా చెప్పాడు. ‘‘నాకు సనాతన ధర్మమే అన్నిటికంటె ముఖ్యం. నేనేమీ తప్పు
మాట్లాడడం లేదు లేదా సొంతగా అబద్ధాలు కల్పించి చెప్పడం లేదు. ఏదైనా తేడా జరిగితే
నేను తప్పక మాట్లాడతాను. పాకిస్తాన్లో ఇలాంటి మతమార్పిడి ఘటనలు చాలా ఉన్నాయి.
కానీ అవేవీ మీడియాలో రావు. అక్కడి పరిస్థితి ఏంటో ప్రపంచం చూస్తోంది. నేను ఎప్పుడూ
నా హిందూ సమాజం కోసం పోరాడుతూనే ఉంటాను’’ అని దానిష్ కనేరియా చాలా స్పష్టంగా
వివరించాడు.