ఇజ్రాయెల్ హమాస్ (Hamas) యుద్ధంలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో హమాస్ ఉప అధిపతి షాదీ బారుద్ హతమయ్యాడు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపుదాడుల సమయంలో ఉగ్రవాది యాహ్యా సిన్వార్‌తో కలిసి బారుద్ పనిచేశాడని ఐడీఎఫ్ (IDF) ప్రకటించింది. యూనిస్ ప్రాంతంలో బారుద్ ఖాన్ హమాస్ ఉగ్రవాదులకు నాయకత్వం వహించాడని, ఉగ్రవాద సంస్థకు చెందిన ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్‌లో కీలక పదవులు నిర్వహించాడు.
తాజాగా జరిపిన వైమానిక దాడుల్లో హమాస్ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ డిప్యూటీ హెడ్ షాదీ బారుద్ హతమైనట్లు ఐడీఎఫ్ ప్రతినిధి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇజ్రాయల్‌పై అక్టోబర్ 7న హమాస్ జరిపిన భీకరదాడులతోపాటు, అనేక దాడులకు బారుద్ ప్రణాళికలు రచించాడని ఇజ్రాయెల్ ప్రకటించింది.
హమాస్ నాయకులు, అనాగరిక దాడులకు దిగిన వారిపై దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు హమాస్‌కు చెందిన 250 స్థావరాలను నాశనం చేసినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. ఇప్పటికీ హమాస్ చెరలో 224 మంది బందీలున్నారని వారిని రక్షించుకోవాల్సి బాధ్యత తమపై ఉందని ఐడిఎఫ్ అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డానియల్ హగారి పేర్కొన్నారు. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో ఇప్పటి వరకు 7 వేల మంది చనిపోయారని అంచనా.