వరల్డ్ కప్ వన్డే (ODI)లో శ్రీలంక సంచలన విజయం నమోదు చేసింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా గురువారం జరిగిన వన్డేలో ఇంగ్లండ్ జట్టుపై శ్రీలంక
8 వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 33.2 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌటైంది. లంక పేసర్లు లహిరు కుమార 3, మాథ్యూస్ 2, రజిత 2 వికెట్లు తీసి ఇంగ్లండ్ జట్టు పతనాన్ని శాసించారు. ఇంగ్లాండ్ జట్టులో స్టోక్స్ 73 బంతుల్లో 43 పరుగులు చేశాడు.
157 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన శ్రీలంక జట్టు 25.4 ఓవర్లలో ఛేదించింది. లంక జట్టులో నిశాంక 83 బంతుల్లో 77 పరుగులు, సమర విక్రమ 54 బంతుల్లో 65 పరుగులతో చెలరేగిపోయారు. ఇప్పటి వరకు వరల్డ్ కప్లో లంకకు ఇది రెండో గెలుపు, లహిరు కుమారకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ఇంగ్లాండ్ జట్టు ఇంటిదారిపట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.టోర్నీలో నిలవాలంటే గురువారం జరిగిన మ్యాచ్లో లంకపై తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. కానీ లంక పేసర్లు మ్యాచ్ను శాసించారు. ఇంగ్లండ్ ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్లలో కేవలం ఒకటి మాత్రమే గెలిచింది. ఇంగ్లండ్ సెమీస్ ఆశలు కూడా గల్లంతైనట్లేనని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.