Qatar death penalty for 8 Indians
భారతదేశానికి చెందిన ఎనిమిది మంది మాజీ నావికాదళ అధికారులకు
కతార్ దేశం మరణ శిక్ష విధించింది. దోహాలో అక్కడి ప్రభుత్వ నిర్బంధంలో ఉన్న
భారతీయులకు అక్కడి న్యాయస్థానం ఈ శిక్ష విధించినట్లు భారత విదేశాంగ శాఖ
వెల్లడించింది. కతార్ న్యాయస్థానం నిర్ణయం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని,
పూర్తి తీర్పు ప్రతి కోసం ఎదురు చూస్తున్నామనీ భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.
‘‘కతార్‌లో అల్ దహ్రా అనే కంపెనీలో
పనిచేస్తున్న 8మంది భారతీయులకు సంబంధించిన కేసులో అక్కడి కోర్టు ఇవాళ తీర్పు
ఇచ్చిందని మాకు ప్రాథమిక సమాచారం అందింది. వారికి మరణశిక్ష విధించడం మమ్మల్ని
తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పూర్తి తీర్పు కోసం ఎదురు చూస్తున్నాం. మేము వారందరి
కుటుంబసభ్యులతోనూ సంప్రదిస్తున్నాం. ఈ కేసులోనుంచి వారిని బైటకు తీసుకురావడానికి న్యాయపరమైన
మార్గాలను అన్వేషిస్తున్నాం’’ అని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
‘‘ఈ కేసుకు మేం అత్యంత ప్రాధాన్యం
ఇస్తున్నాం. బాధితులకు అవసరమైన దౌత్యపరమైన, న్యాయపరమైన సహాయం అందిస్తూనే ఉంటాం. ఈ
తీర్పు గురించి కతార్ అధికారులతో కూడా మాట్లాడతాం. ఈ కేసు ప్రొసీడింగ్స్‌ను
గోప్యంగా ఉంచవలసిన కారణంగా, ఈ తరుణంలో ఇంతకు మించి ఎలాంటి వ్యాఖ్యలూ చేయడం సరికాదు’’
అని విదేశాంగశాఖ ప్రకటించింది.
ఎనిమిది మంది భారతీయులు కతార్‌లో
అక్టోబర్ 2022లో బంధించారు. ఒక జలాంతర్గామి ప్రోగ్రామ్‌కు సంబంధించి గూఢచర్యం
చేసిన ఆరోపణలు వారిపై మోపారు. ఈ యేడాది మార్చిలో కేసు విచారణ మొదలైంది.
భారతప్రభుత్వం వారికి కాన్సులర్ యాక్సెస్ మంజూరు చేసింది, వారిని విడుదల చేయించేందుకు
కృషి చేస్తోంది.
బందీలైన అధికారుల్లో
ఒకవ్యక్తి సోదరి, గ్వాలియర్‌కు చెందిన మీతూ భార్గవ, తన సోదరుణ్ణి స్వదేశానికి వెనక్కు
తీసుకురావడానికి ప్రభుత్వ సహాయం కోరుతోంది. ఈ కేసు విషయంలో జోక్యం చేసుకోవాలంటూ ఆమె
జూన్ 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఎక్స్ మీడియా ద్వారా విన్నవించుకుంది.