మహారాష్ట్ర
పర్యటన (MAHARASHTRA TOUR)లో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ(PM MODI), షిరిడీ(SHIRDI)లోని సాయిబాబా ఆలయాన్ని సందర్శించి,
ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం షిరిడీ ఎయిర్ పోర్టులో దిగిన ప్రధాని, అక్కడ నుంచి
ఆలయానికి చేరుకున్నారు.
ప్రధాని వెంట గవర్నర్
రమేష్ బైస్, ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర
ఫడ్నవీస్, అజిత్ పవార్ ఉన్నారు.
పూజా
కార్యక్రమాల అనంతరం ఆలయ ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన దర్శన్ క్యూ కాంప్లెక్స్‌ను
ప్రారంభించారు. రూ.112 కోట్ల తో నిర్మించిన ఈ భవనంలో పదివేల మంది భక్తుల వేచి
ఉండవచ్చు. ఏసీ సౌకర్యంతో పాటు, క్లోక్ రూమ్, టాయిలెట్స్, సమాచార కేంద్రం, ప్రసాద
వితరణ కేంద్రాలు, బుకింగ్ కౌంటర్స్ సదుపాయాలను ఈ భవనంలో కల్పించారు.
నాలుగేళ్ళలో
ప్రధాని రెండోసారి షిరిడీని సందర్శించారు. 2018లో సాయిబాబా 100వ వర్ధంతి
సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో
ప్రధాని పాల్గొన్నారు. ప్రస్తుతం
ప్రారంభోత్సవం చేసిన భవనానికి అప్పటి పర్యటనలో భూమిపూజ చేశారు.
సాయి
దర్శనం అనంతరం నిల్వాండే డ్యామ్ దగ్గర గంగమ్మకు పూజలు నిర్వహించారు. విహంగ
వీక్షణం ద్వారా ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టును జాతికి అంకితం
చేశారు. ఈ నీటి ప్రాజెక్టు ద్వారా అహ్మద్‌నగర్
జిల్లా లోని 182 గ్రామాలకు నీరు అందించవచ్చు. 1970లో ఈ డ్యామ్ నిర్మాణానికి
రూపకల్పన చేయగా, ప్రస్తుతం రూ. 5,177 కోట్లతో నిర్మించారు.
మహారాష్ట్ర
పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని ప్రారంభించారు. సుమారు రూ.
7,500 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను జాతికి అంకితం చేశారు.
మహారాష్ట్ర
పర్యటన ముగిసిన తర్వాత గోవా వెళ్ళి అక్కడ 37 వ నేషనల్ గేమ్స్ ను ప్రారంభించారు.