డబ్బు తీసుకుని పార్లమెంటులో ప్రశ్నలు వేశారనే ఆరోపణలు ఎదుర్కొంటోన్న తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా కేసు (mahua moitra case) చాలా తీవ్రమైందని లోక్‌సభ ఎథిక్స్ కమిటీ అభిప్రాయపడింది. అక్టోబర్ 31న తమ ముందు హాజరు కావాలని లోక్‌సభ ఎథిక్స్ కమిటీ ఎంపీ మహువా మొయిత్రాకు సమన్లు జారీ చేసింది.
ఇవాళ దాదాపు మూడు గంటలపాటుసాగిన విచారణలో, బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే, న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్‌ను విచారించింది. తృణమూల్ ఎంపీ చేసిన ఆరోపణలకు సంబంధించిన ప్రతి అంశాల్ని విచారించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో లోతైన సమాచారం కోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ శాఖకు లేఖలు పంపినట్లు ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ వినోద్ సోంకర్ వెల్లడించారు.న్యాయవాది, బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే వాదనలు విన్న తరవాత, మంగళవారం ఎథిక్స్ కమిటీ ముందు హాజరు కావాలని మహువా మొయిత్రాకు సమన్లు జారీ చేసినట్లు సోంకర్ తెలిపారు.
ఈ కేసులో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని బీజేపీ ఎంపీ దూబే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీతో కలసి ఎంపీ మహువా మొయిత్రా అదానీ గ్రూప్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రశ్నలు వేశారని దూబే ఆరోపించారు. లోక్‌సభ ఎథిక్స్ కమిటీ వేసిన అన్ని ప్రశ్నలకు దూబే ప్రశాంతంగా సమాధానాలు చెప్పినట్లు న్యాయవాది తెలిపారు. తనను కూడా ఎథిక్స్ కమిటీ కొన్ని ప్రశ్నలు వేసినట్లు చెప్పారు. ఎథిక్స్ కమిటీ సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇస్తుందని న్యాయవాది అభిప్రాయపడ్డారు.
తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా పార్లమెంటరీ ఐడీని దుర్వినియోగం చేశారని, బీజేపీ ఎంపీ దూబే చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ తరపున లోక్‌సభలో అదానీ గ్రూప్‌పై ప్రశ్నలు వేశారని ఎంపీ దూబే ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ విచారణ జరుపుతోంది. తృణమూల్ ఎంపీ మహువాపై వచ్చిన ఆరోపణలపై, సరైన సమయంలో స్పందిస్తామంటూ ఆ పార్టీ సీనియర్ నేత డెరెక్ ఓబ్రెయిన్ వ్యాఖ్యానించారు.