Poster war in UP indicates gaps in INDI alliance parties
Congress and SP
భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి – ‘భాజాఅసకూ’ (ఇండీ కూటమి)లో
ప్రధానమంత్రి పదవికి పోటీదారు ఎవరన్న స్పష్టత ఇంకా రాలేదు. ఉత్తరప్రదేశ్‌లో
కూటమిలోని పార్టీల మధ్య లుకలుకలు మొదలైపోయాయి. దాన్ని మరింత ముందుకు తీసుకువెడుతూ,
ఇప్పుడు పోస్టర్ల యుద్ధం ముదురుతోంది.
లక్నోలో కాంగ్రెస్ కార్యాలయం ముందు పార్టీ కార్యకర్తలు ఒక
పోస్టర్ అతికించారు. అందులో, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తమ ప్రధానమంత్రి అభ్యర్ధి
రాహుల్ గాంధీ (Rahul Gandhi) అని ప్రకటించారు. 2027లో రాష్ట్రంలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో
పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు అజయ్ రాయ్ (Ajay Rai) ముఖ్యమంత్రి అభ్యర్ధి అని కూడా
ప్రకటించేసారు.
మామూలుగా అయితే అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం
అనుకోవచ్చు. సీఎం సంగతి ఎలా ఉన్నా… పార్టీ తరఫున ప్రధాని అభ్యర్ధి రాహుల్ గాంధీ
అనడానికి కాంగ్రెస్‌లో ఎవరికీ అభ్యంతరం ఉండదు. అలాంటప్పుడు గొడవేముంది
అనుకుంటున్నారా? ఉంది. అక్కడే అసలైన గొడవ మొదలైంది.
భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఓడించడానికి
కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీలతో ఇండీ కూటమి (భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి
– భాజాఅసకూ) ఏర్పాటు చేసింది. అందులో సమాజ్‌వాదీ పార్టీ కూడా ఉంది. మొదటినుంచీ
అతుకులబొంతగానే ఉన్న భాజాఅసకూ వ్యవహారంలో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ
పార్టీలకు పడడం లేదు. ఆ రెండు పార్టీలూ ఉప్పూ నిప్పూ అన్నట్టు ఉంటున్నాయి. ఇప్పుడా
గొడవ మరింత ముదిరింది. కొద్దిరోజుల క్రితం సపా కార్యకర్తలు తమ నాయకుడు అఖిలేష్
యాదవే ప్రధానమంత్రి అభ్యర్ధి అని పోస్టర్లు వేసారు. దానికి ప్రతిగా కాంగ్రెస్
కార్యకర్తలు ఈ తాజా పోస్టర్ వేసారన్నమాట.
ఈ గొడవ.. మధ్యప్రదేశ్
శాసనసభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ పోటీ చేయాలనుకోవడం దగ్గర మొదలైంది. ఎస్పీకి
మధ్యప్రదేశ్‌లో ఏమాత్రం బలం లేదు కాబట్టి, కాంగ్రెస్‌కి మద్దతుగా ఉంటూ ఆ పార్టీ
మధ్యప్రదేశ్ ఎన్నికల నుంచి ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ యూపీ అధ్యక్షుడు అజయ్
రాయ్ సమాజ్‌వాదీ పార్టీని అడిగాడు. అది అఖిలేష్ యాదవ్‌కి నచ్చలేదు. కాంగ్రెస్
నాయకులు బీజేపీకి కొమ్ము కాస్తున్నారని అఖిలేష్ యాదవ్ ఆరోపించాడు. కాంగ్రెస్ తమకు
ద్రోహం చేస్తుందని తెలిస్తే తాము అసలు ఆ పార్టీని నమ్మేవారమే కాదని
వ్యాఖ్యానించాడు.
ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజంఖాన్ నకిలీ మార్కుషీట్ల కేసులో నేరస్తుడిగా రుజువై,
తన కొడుకుతో కలిసి సీతాపూర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. కాంగ్రెస్ నేత అజయ్ రాయ్
ఆ సమయంలో తాను జైలుకు వెళ్ళి ఆజంఖాన్, అతని కుమారుణ్ణి పరామర్శించి వస్తానని బయల్దేరాడు. ఆ నిర్ణయం కూడా సమాజ్‌వాది పార్టీకి నచ్చలేదు. యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోని రాష్ట్రప్రభుత్వం
ఆజంఖాన్‌ను వేధించినప్పుడు కాంగ్రెస్ ఎక్కడికి పోయింది? అంటూ అఖిలేష్ యాదవ్ ఘాటుగా
ప్రశ్నించాడు. నిజానికి కాంగ్రెస్ నాయకులే ఆజంఖాన్‌ను లక్ష్యంగా చేసుకున్నారని
కూడా ఆరోపించాడు.
మరోవైపు, ఇండీ కూటమి ప్రధాన లక్ష్యం బీజేపీని
ఓడించడమే అన్నసంగతి తనకు తెలియదని అఖిలేష్ యాదవ్ చెప్పడం వివాదాస్పదమైంది.
కూటమిలోని పార్టీలు రాష్ట్రస్థాయిలో కలిసి పనిచేయడం లేదని అఖిలేష్ స్పష్టం చేసాడు.
తద్వారా తమ పొత్తు జాతీయ స్థాయలో లేదని తేల్చిచెప్పేసాడు.
భాజాఅస కూటమిలో పార్టీల
మధ్య ఏకాభిప్రాయం లేదనడానికి కాంగ్రెస్ సమాజ్‌వాదీ పార్టీల మధ్య ఈ చిచ్చు
నిదర్శనంగా నిలిచింది.