ఇజ్రాయెల్ హమాస్ (Israel Hamas) ఉగ్రవాదుల మధ్య జరుగుతోన్న యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాజాపై భూతల యుద్ధానికి సన్నద్ధం అవుతున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్వయంగా ప్రకటించారు. ‘‘ మా అస్తిత్వం కాపాడుకునేందుకు మేం యుద్ధం చేస్తున్నాం’’అంటూ ఇజ్రాయెల్ ప్రధాని మరోసారి స్పష్టం చేశారు. హమాస్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఈ యుద్ధం సాగుతోంది. మా దేశాన్ని రక్షించుకునేందుకు భూతల దాడులకు సిద్దం అవుతోన్నట్లు నెతన్యాహు తెలిపారు.
ఇజ్రాయెల్ సైన్యం భూతల దాడులకు సిద్దం అవుతోంది. అయితే ఎక్కడ నుంచి, ఎలా మొదలు పెడతారనేది మాత్రం ప్రకటించలేదు. ఇజ్రాయెల్ తన అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు హమాస్ ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడం, బందీలను విడిపించుకోవడం కోసం భూతల యుద్ధం మొదలు పెట్టబోతున్నట్లు ఆ దేశ ప్రధాని నెతన్యాహు జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో వెల్లడించారు. ఇప్పటికే హమాస్ ఉగ్రవాదుల్లో ముఖ్యలు చనిపోయారని, సమూలంగా అంతమొందించే వరకు యుద్ధం కొనసాగుతుందని నెతన్యాహు స్పష్టం చేశారు.అప్పటి వరకు ఎలాంటి రాజకీయ మధ్యవర్తిత్వాలకు తావులేదన్నారు.
ఉగ్రవాదంపై విజయం సాధించడం, దేశాన్ని రక్షించుకోవడం తమ ముందున్న లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. ఇప్పటికే వేలాది మంది ఉగ్రవాదులు చనిపోయారు. ఇది ప్రారంభం మాత్రమేనని ఆయన హెచ్చరించారు. భూతల యుద్ధం ఎప్పుడు ప్రారంభించాలనేది వార్ క్యాబినెట్, ముఖ్యసైన్యాధికారి నిర్ణయిస్తారని నెతన్యాహు తెలిపారు. ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదుల దాడికి, భూతల దాడుల ద్వారా సరైన జవాబిస్తామని ఆయన అన్నారు.
ఇజ్రాయెల్, హమాస్ దాడుల్లో గాజాలో ఓ విలేకరి కుటుంబం బలైంది. అల్‌జజీరా గాజా బ్యూరో చీఫ్ వాయెల్ దాహ్‌డౌ భార్య, కుమారుడు, కుమార్తె, మనవడు వైమానిక దాడుల్లో చనిపోయినట్లు ప్రకటించారు. జర్నలిస్ట్ కుటుంబం మృతికి సంబంధించిన వీడియోలను అల్‌జజీరా ప్రసారం చేసింది. అల్‌జజీరా విలేకరి దాహ్‌దౌ క్షేమంగా ఉన్నారు.