India partially resumes visa services to Canada
సుమారు నెలరోజులుగా కెనడాకు నిలిపివేసిన
వీసా సేవలను భారత్ నేటినుంచీ పాక్షికంగా పునరుద్ధరిస్తోంది. ఎంట్రీ వీసా, బిజినెస్
వీసా, మెడికల్ వీసా, కాన్ఫరెన్స్ వీసా సేవలను అనుమతిస్తామని ఒట్టావాలోని భారత
హైకమిషన్ వెల్లడించింది.
‘ఇరుదేశాల మధ్యా పరిస్థితులు
కొనసాగడాన్ని బట్టి తగిన సమయంలో తగిన నిర్ణయాలు తీసుకుంటాం. వాటి గురించి ఎప్పటికప్పుడు
వెల్లడిస్తాం’ అని భారత హైకమిషన్ ఒక ప్రకటనలో తెలియజేసింది.
కెనడా-భారత్ మధ్య దౌత్యఘర్షణలు
ప్రారంభమైన సెప్టెంబర్ నెల నుంచీ ఆ దేశంలో వీసా సేవలను భారత్ నిలిపివేసింది. ఈ
ఆదివారం భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మాట్లాడుతూ, కెనడాలోని భారత
దౌత్యవేత్తలు, దౌత్యకార్యాలయ అధికారుల భద్రత విషయంలో పురోగతి ఉంటే, అక్కడ వీసాలు
జారీ చేసే ప్రక్రియను పునరుద్ధరించడానికి భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. కేవలం
భద్రతా కారణాల వల్లనే వీసాల జారీ నిలిపివేసినట్లు ఆయన వెల్లడించారు.
భారత్
ఉగ్రవాదిగా గుర్తించిన, కెనడా పౌరసత్వం పొందిన ఖలిస్తానీ నేత హర్దీప్ సింగ్
నిజ్జర్ హత్య తర్వాత కెనడా భారత్ సంబంధాలు దెబ్బతిన్నాయి. జి-20 సమావేశాలకు ఢిల్లీ
వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత కెనడా పార్లమెంట్లో
నేరుగా భారత గూఢచారి సంస్థలపై ఆయన చేసిన ఆరోపణలు పరిస్థితిని మరింత దిగజార్చాయి.
నిజ్జర్ హత్య రాజకీయ ప్రేరేపితమనీ, భారత గూఢచారుల చర్య అనీ ట్రూడో చేసిన ఆరోపణలపై
భారత్ మండిపడింది. ఆ ఆరోపణలకు ఆధారాలు చూపాలన్న భారత్ డిమాండ్‌ను కెనడా త్రోసిపుచ్చింది.
ఆ నేపథ్యంలో కెనడాలో వీసా సేవలను భారత్ నిలిపివేసింది.