శ్రీ
శోభకృత్ నామ సంవత్సర ఆశ్వీయుజ పౌర్ణమి అనగా ఈ నెల 28నాడు రాహుగ్రస్త పాక్షిక
చంద్రగ్రహణ(LUNAR ECLIPSE) సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ
ఆలయాల్లో దర్శనాలు నిలిపివేస్తున్నారు. గ్రహణం విడిచిన తర్వాత శుద్ధి కార్యక్రమాలు
నిర్వహించిన అనంతరం భక్తులకు యధావిధిగా దర్శనం కల్పిస్తామని ఆలయ అధికారులు
వెల్లడించారు.
గ్రహణం
కారణంగా తిరుమలలో సుమారు 8 గంటలపాటు దేవదేవుడి ఆలయం తలుపులు మూసి ఉంచనున్నట్లు
టీటీడీ పేర్కొంది. 28 అర్ధరాత్రి దాటిన తర్వాత 1.05 గంటల నుంచి
2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం(CHNDRA GRAHANAM) ఉంది. గ్రహణ సమయానికి ఆరు గంటల ముందు తలుపులు మూసివేయడం ఆనవాయితీ.
అందుకని 28న రాత్రి 7.05 గంటలకు ఆలయం తలుపులు మూసివేయనున్నారు.
విజయవాడ
ఇంద్రకీలాద్రిపై ఆగమశాస్త్ర ప్రకారం 28 సాయంత్రం 6గంటల 30 నిమిషాలకు అమ్మవారి
ప్రధానాలయంతో పాటు ఉపఆలయాల కవాట బంధనం చేస్తున్నట్లు శ్రీదుర్గామల్లేశ్వర
స్వామివార్ల దేవస్థాన అధికారులు తెలిపారు. గ్రహణ మోక్ష కాలం అనంతరం 29(ఆదివారం)
ఉదయం కవాట ఉద్ఘాటన చేసి దేవతామూర్తులకు స్నపనాభిషేకాలు నిర్వహిస్తారు.
ఉదయం 9గంటల
30 నిమిషాల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తారు.
గ్రహణం
కారణంగా 28న సాయంత్రం నిర్వహించే పల్లకీసేవను అధికారులు రద్దు చేశారు. 29 తేదీ
ఉదయం నిర్వహించాల్సిన సుప్రభాతం, వస్త్రసేవ, ఖడ్గమాలార్చన కూడా నిలిపివేసినట్లు
తెలిపారు.
శ్రీశైలంలో
28 సాయంత్రం 5 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు ఆలయ ద్వారాలు
మూసివేయనున్నట్లు దేవాలయ అధికారులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 3.30గంటల వరకు
మాత్రమే భక్తులను సర్వ దర్శనానికి అనుమతిస్తారు. గ్రహణం కారణంగా స్వామివార్ల
నిత్యకళ్యాణం నిలిపివేశారు.
గ్రహణం
కారణంగా ఆలయ ప్రాంగణంలోని పరివార ఆలయ ద్వారాలు, సాక్షిగణపతి, హఠకేశ్వరం, పాలధార- పంచధార, శిఖరేశ్వరం
తదితర ఉపాలయ ద్వారాలు కూడా శనివారం సాయంత్రం 5 గంటల
తర్వాత మూసివేయనున్నారు.