Ram Lalla to be consecrated on 22 Jan 2024
శ్రీరామచంద్రుడి జన్మభూమి అయోధ్యలో
కొన్ని వందల సంవత్సరాల తర్వాత రామమందిర నిర్మాణం జరుగుతోంది. 2024 జనవరి 22న
విగ్రహ ప్రతిష్ఠాపన జరుగుతుంది. గర్భగుడిలో బాలరాముడి విగ్రహాన్ని
ప్రతిష్ఠించవలసిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ కోరింది.
తన జీవితకాలంలో జరుగుతున్న చారిత్రక ఘట్టంలో పాల్గొనగలగడం తనకు దక్కిన గొప్ప
అవకాశమని మోదీ వ్యాఖ్యానించారు.
రామజన్మభూమి ట్రస్ట్‌కు చెందిన ఆచార్య
సత్యేంద్ర దాస్ ఆ వివరాలను తెలియజేసారు. ‘‘రామమందిర ప్రారంభోత్సవానికి
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి శ్రీరామజన్మభూమి ట్రస్ట్ ఆహ్వానం పంపించింది. దాన్ని
ప్రధానమంత్రి అంగీకరించారు. 2024 జనవరి 22న జరిగే కార్యక్రమంలో పాల్గొంటానని
వెల్లడించారు’’ అని చెప్పారు.
శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ప్రతినిథులు
ప్రధానమంత్రిని కలిసిన తర్వాత కార్యక్రమం తేదీ జనవరి 22గా ఖరారు చేసారు. ఆరోజు
మోదీ అయోధ్య వెడతారు. బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసే కార్యక్రమంలో
పాల్గొంటారు.
ఆనాటి కార్యక్రమానికి దేశం నలుమూలల
నుంచీ 4వేలమంది సాధువులు, మహాత్ములు, ఇతర విశిష్ఠ అతిథులు పాల్గొంటారని ట్రస్ట్
ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ఎక్స్‌లో పోస్ట్ చేసారు. ట్రస్ట్ ప్రతినిధులు మోదీని
కలిసి లాంఛనంగా ఆహ్వానించారని వెల్లడించారు.
‘‘ఉడుపి పెజావర్ మఠానికి చెందిన పూజ్య
విశ్వప్రసన్నతీర్థ స్వామి, స్వామీ గోవిందదేవ్ గిరి, మందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్
నృపేంద్ర మిశ్రా, నేను ప్రధానమంత్రికి ఆహ్వానపత్రిక అందించాం. కార్యక్రమంలో భాగం
కావడానికి ప్రధాని అంగీకరించారు’’ అని చంపత్ రాయ్ ఎక్స్ పోస్ట్‌లో రాసారు.
అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు 2019లో
తీర్పు ఇవ్వడంతో భవ్య రామమందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఆలయ నిర్మాణానికి
చెందిన అన్ని నిర్ణయాలూ తీసుకోడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం శ్రీరామజన్మభూమి
తీర్థక్షేత్ర ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది. మందిర నిర్మాణానికి ప్రధానమంత్రి
నరేంద్ర మోదీ 2020 ఆగస్టు 5న శంకుస్థాపన చేసారు.
మందిర ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానం
అందిందని ప్రధానమంత్రి ప్రకటించారు. ‘‘ఈరోజు ఎన్నో భావోద్వేగాలతో నిండిన రోజు.
ఈమధ్యనే రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ బాధ్యులు నన్ను కలిసారు. అయోధ్యలో
రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. గర్భగుడిలో విగ్రహ ప్రతిష్ఠాపన చేయాలని
చెప్పారు. అది నాకు అతిగొప్ప ఆశీర్వాదం. నా జీవితకాలంలో ఇలాంటి చారిత్రక సంఘటనకు
సాక్షిగా ఉండడం నా అదృష్టం.’’ అని ప్రధాని ఎక్స్‌లో రాసుకొచ్చారు.
రామమందిర నిర్మాణానికి ప్రత్యేకమైన
ఇటుకలు వాడుతున్నారు. ‘శ్రీరామ్ 2023’ అని రాసిన ఆ ఇటుకలు సాధారణ ఇటుకల కంటె
దృఢంగా, ఎక్కువకాలం మన్నేలా ప్రత్యేకంగా తయారుచేసారు.
ఆలయ నిర్మాణం ఈ యేడాది ఆఖరికల్లా
పూర్తవుతుందని, జనవరి 26 కంటె ముందే భక్తులకు బాలరాముడు దర్శనమిస్తాడనీ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఇప్పటికే
వెల్లడించారు. రోజుకు 12 గంటలు మందిరం తెరచి ఉంచితే 70 నుంచి 75వేల మంది భక్తులు
రాముణ్ణి దర్శించుకోగలుగుతారని ఆయన చెప్పారు. ఆలయ నిర్మాణంలో ప్రభుత్వ జోక్యం ఏమీ
లేదనీ, నిధులు మొత్తం విరాళాలుగా వచ్చాయనీ ఆయన వివరించారు. ఇప్పటివరకూ రూ.3500
కోట్ల విరాళాలు లభించాయని వెల్లడించారు.