Iran Bans 12 Actresses For Violating Hijab Law
హిజాబ్ ధరించని కారణంగా 12మంది నటీమణులపై
ఇరాన్ దేశం నిషేధం విధించింది. ఇరాన్ కఠినంగా అమలు చేస్తున్న డ్రెస్‌కోడ్
ప్రకారం మహిళలు హిజాబ్ తప్పనిసరిగా ధరించాల్సిందే. ఆ నియమాన్ని ఉల్లంఘించిన వారిపై
నిషేధం విధించారు.
‘‘చట్టాన్ని పాటించని వారిని పని
చేసుకోడానికి అనుమతించే ప్రసక్తే లేదు’’ అని ఇరాన్ సంస్కృతి, మతాచారాల శాఖ మంత్రి
మహమ్మద్ మెహదీ ఇస్మాయిలీ చెప్పారు. మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ
నిర్ణయం తీసుకున్నారు.
హిజాబ్ చట్టాన్ని ఉల్లంఘించిన
కారణానికి మహిళా నటుల మీద సినిమాల్లో నటించకుండా నిషేధం విధించినట్లు ఇరాన్ మీడియా
వెల్లడించింది. తరానే అలీదూస్తీ, కటయొన్ రియాహీ, ఫాతెమె మొతామెద్ అరియా వంటి నటీమణులు
ఈ నిషిద్ధ జాబితాలో ఉన్నారు.
గతేడాది మహ్సా అమీనీ అనే 22ఏళ్ళ
ఇరానియన్ కుర్దు మహిళను హిజాబ్ ధరించలేదన్న కారణంతో పోలీసులు నిర్బంధించారు. వారి
నిర్బంధంలో ఉండగానే ఆ యువతి చనిపోయింది. ఆ ఘటన ఇరాన్లో ప్రకంపనలు సృష్టించింది.
అప్పుడు హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసనలు పెల్లుబికాయి. ఆ నిరసనల్లో తరానే
అలీదూస్తీ, కటయొన్ రియాహీ కూడా పాల్గొన్నారు. ఆ ఆందోళనల తర్వాత ఇరాన్లో డ్రెస్‌కోడ్
నిబంధనల ఉల్లంఘనలు పెరిగాయి. హిజాబ్, బురఖా తప్పనిసరిగా ధరించాలన్న నియమాలను
పాటించని మహిళల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
ఇరాన్లో 1979లో ఇస్లామిక్ విప్లవం
జరిగింది. ఆ తర్వాత నాలుగేళ్ళకు, అంటే 1983 నుంచీ, ఆ దేశంలో మహిళల దుస్తులపై ఆంక్షలు
పెరిగాయి. మెడ, ముఖం కనిపించకుండా వస్త్రధారణ చేయడం తప్పనిసరి అయింది. ఆ చట్టాన్ని
వ్యతిరేకించే వారూ క్రమంగా పెరుగుతూ వచ్చారు.
మహ్సా అమీనీ మరణానంతర పరిణామాల
నేపథ్యంలో ఇరాన్ గత కొన్ని నెలలుగా హిజాబ్
నియమాలను పాటించని మహిళలు, వ్యాపారాలపై ఆంక్షలు తీవ్రతరం చేసింది.
ఈ యేడాది సెప్టెంబర్‌లో, హిజాబ్ చట్టాన్ని
ఉల్లంఘించేవారికి విధించే శిక్షలను ఇరాన్ ప్రభుత్వం పెంచింది. కొత్త నియమాల
ప్రకారం గరిష్టంగా పదేళ్ళ జైలుశిక్ష విధించవచ్చు.