రాజకీయ
పార్టీలన్నీ ఎన్నికల వ్యూహంలో మునిగిపోయాయి. ఎత్తుకు పైఎత్తులు, ప్రజాకర్షక
నినాదాలు, పోటాపోటీ సభల్లో అన్ని పార్టీలు తీరకలేకుండా గడుపుతున్నాయి. ఓటరును
ప్రసన్నం చేసుకునేందుకు అవసరమైన అన్ని విద్యలు ప్రదర్శిస్తున్నాయి. మరో వైపు
స్థానికంగా ఉన్న మాస్ లీడర్లను గుర్తించి తమ పార్టీ కండువా మెడలో వేస్తున్నాయి.
ఇప్పటికే
కోట్ల రూపాయలు పెట్టి ఎన్నికల వ్యూహకర్తలను నియమించుకున్న వైసీపీ, టీడీపీలు వచ్చే
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. ప్రజాక్షేత్రంలో సుడిగాలి
పర్యటనలు చేస్తున్న నేతలు పరస్పర విమర్శలు చేసుకోవడంతో పాటు ఎన్నికల వాగ్దానాలు
గుప్పిస్తున్నారు.
అధికారాన్ని
నిలబెట్టుకునేందుకు పాలక వైసీపీ కష్టపడుతుండగా, ఎలాగైనా ఈ సారి ప్రభుత్వాన్ని
ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష టీడీపీ ఆశ పడుతోంది. తమ పార్టీ అధినేత అరెస్టుతో
ప్రజల్లో ఉన్న సానుభూతిని ఓట్లుగా మలుచుకునే పనిలో తెలుగు తమ్ముళ్లు ఉన్నారు.
చంద్రబాబును
అక్రమంగా అరెస్టు చేశారంటూ టీడీపీ నేటి నుంచి బస్సు యాత్ర మొదలుపెట్టింది. చంద్రబాబు
సతీమణి నారా భువనేశ్వరి ‘నిజమే గెలుస్తుంది’ పేరిట ఈ యాత్ర చేస్తున్నారు. చంద్రబాబు
అరెస్టుతో మనస్తాపం చెంది, మరణించారని టీడీపీ చెబుతున్న వారి కుటుంబ సభ్యులను
పరామర్శించి నగదు సాయం అందిస్తున్నారు. చంద్రగిరిలో నేడు పర్యటించిన నారా
భువనేశ్వరి, రెండు కుటుంబాలను ఓదార్చారు. ఆయా కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని
తెలిపారు. చెరో రూ.3 లక్షల నగదు సాయం అందించారు.
మరో
వైపు పాలక వైసీపీ కూడా బస్సు యాత్ర చేపట్టింది. ‘సామాజిక సాధికార యాత్ర’ పేరిట
వైసీపీ కూడా ప్రజల్లోకి వెళుతోంది. స్థానిక ఎమ్మెల్యే సహా బీసీ, ఎస్సీ, ఎస్టీ,
మైనారిటీ నేతలతో ఈ యాత్ర చేపట్టి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను
వివరించనున్నారు. సంక్షేమం కావాలంటే వైసీపీకే ఓటు వేయాలని కోరుతున్నారు. అలాగే
పాలకపార్టీపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను సమాధానం చెప్పనున్నారు.
చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయలేదని, తప్పు చేసినట్లు ఆధారాలు దొరకడంతో దర్యాప్తు
సంస్థలు విచారణ చేస్తున్నాయని చెబుతున్నారు. జనసేన-టీడీపీ పొత్తు నేపథ్యంలో కొన్ని
కులాల ఓట్లు పడకపోవచ్చు అని అంచనా వేస్తున్న పాలక పార్టీ వ్యూహకర్తలు ఆ నష్టాన్ని
మిగతా వర్గాల ద్వారా పూడ్చుకోవాలని భావిస్తున్నారు.
ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వారాహి పేరిట
రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇప్పటికే నాలుగు విడతలుగా ఆయన యాత్ర సాగింది.
టీడీపీ-జనసేన పొత్తు నేపథ్యలో ఇరుపార్టీల ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రచారానికి ప్రణాళిక
సిద్ధం చేస్తున్నారు.