Israel Ready to Invade Gaza Strip
గాజా స్ట్రిప్ మీద ఇజ్రాయెల్
ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. హమాస్ ఉగ్రవాద సంస్థ నిర్బంధించిన తమ ప్రజలను
విడిచిపెట్టేవరకూ దాడులు చేస్తూనే ఉంటామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (Israel
Defence Forces – IDF) హెచ్చరంచింది. అదే సమయంలో హమాస్ బందీలుగా
ఉన్న తమవారి గురించి సమాచారమిస్తే నగదు బహుమతి ఇస్తామని గాజా పౌరులకు ఆఫర్
ఇచ్చింది. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, వారికి భద్రత కూడా కల్పిస్తామనీ హామీ
ఇచ్చింది.
ఐడీఎఫ్ ప్రకారం సుమారు 220 మంది
ఇజ్రాయెలీలను హమాస్ నిర్బంధించింది. వారిని వెంటనే విడిచిపెట్టాలని హమాస్‌ను
ఇజ్రాయెల్ హెచ్చరించింది. ‘‘మీరు ప్రశాంతంగా బతకాలనుకుంటే, మీ పిల్లలకు మెరుగైన
భవిష్యత్తునివ్వాలనుకుంటే మానవత్వంతో స్పందించండి. హమాస్ ఎత్తుకెళ్ళిన, మీ
ప్రాంతంలో బందీలుగా ఉన్న మా వాళ్ళ గురించి కచ్చితమైన విశ్వసనీయమైన సమాచారం
ఇవ్వండి. మీకు, మీ కుటుంబానికీ రక్షణ కల్పించే బాధ్యత మాది. మీ వివరాలను గోప్యంగా ఉంచుతాం.
మీకు నగదు బహుమతి కూడా అందిస్తాం’’ అని ఐడీఎఫ్ ప్రకటించింది. అలాంటి సమాచారాన్ని
అందించడానికి ప్రత్యేక ఫోన్ నెంబర్లు కూడా ప్రకటించింది.
హమాస్ తమ బందీలను విడుదల చేసే
ప్రక్రియ ప్రారంభించింది. సోమవారం నాడు ఇద్దరు ఇజ్రాయెలీ మహిళలను విడిచిపెట్టింది.
అంతకంటె ముందే ఇద్దరు అమెరికన్ పర్యాటకులను కూడా వదిలేసింది. మరికొద్దిరోజుల్లో
మరో 50 మందిని విడిచిపెడతారని కూడా ప్రకటించింది.
ఇజ్రాయెల్ సైన్యం సిరియా వైపు కూడా
ప్రతిదాడులు చేసామని ధ్రువీకరించింది. తమ భూభాగంమీద నిన్న దాడులు చేసిన సిరియా
సైనిక వ్యవస్థలపైన డ్రోన్ దాడి చేసామని ప్రకటించింది. ఆ దాడిలో ఇద్దరు పాలస్తీనియన్లు
మరణించారని సమాచారం.
ఇజ్రాయెల్ దక్షిణ సరిహద్దు వద్ద మోహరించిన
బలగాలు గాజా స్ట్రిప్‌ను ఆక్రమించడానికి సిద్ధంగా ఉన్నాయి. ‘మేం గాజా స్ట్రిప్‌ను
ఆక్రమించడానికి సిద్ధంగా ఉన్నాం’ అని ఐడీఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్
హెర్జీ హలేవీ విస్పష్టంగా ప్రకటించారు. గగనతలం నుంచి చేస్తున్న దాడులకు తోడు,
భూమార్గంలోనూ వెళ్ళి గాజా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోడానికి తమ బలగాలు సిద్ధంగా
ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఐతే, గాజా ఆక్రమణ గురించి నిర్ణయం రాజకీయ నేతలే
తీసుకుంటారని వివరించారు.
హమాస్‌ను పూర్తిస్థాయిలో నేలమట్టం
చేయడమే తమ ఏకైక లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అప్పటికే
ప్రకటించారు. ‘మా యోధులు రణక్షేత్రంలో ఉన్నారు. మా లక్ష్యం ఒకటే, హమాస్‌ను
తుడిచిపెట్టేయడం. ఆ లక్ష్యం పూర్తయేవరకూ ఆగే ప్రసక్తే లేదు’ అని తేల్చిచెప్పారు.