మద్యం
విక్రయాల్లో అక్రమాలు, దశల వారీ మద్యనిషేధం హామీపై రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న
విధానాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి మరోసారి దుయ్యబట్టారు. మద్యం
కంపెనీల యజమానులను వైసీపీ ప్రజాప్రతినిధులు బెదిరించి సబ్ లీజులు తీసుకున్నారని
ఆరోపించారు.
మద్యం దుకాణాల్లో ఆన్లైన్ పేమెంట్లు జరగకపోవడంపై కూడా ఆమె
ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏపీ ఆన్లైన్కు చెల్లింపులు చేయాలని చెప్పడం వెనుక
ఆంతర్యం ఏంటని నిలదీశారు. ఆన్లైన్ పనిచేయడం లేదని చెబుతూ వినియోగదారుల నుంచి నగదు
వసూలు చేస్తున్నారని చెప్పారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి, మరో ఎంపీ
మిథున్ రెడ్డి సహా ఇతర ముఖ్యనేతల ఆధ్వర్యంలో మద్యం తయారీ కంపెనీలు నడుస్తున్నాయని
వివరించారు.
బీజేపీ ప్రశ్నలకు ప్రభుత్వం
సమాధానం చెప్పకపోవడంతో వైసీపీ నేతల పేర్లను తామే బయటపెడుతున్నామన్నారు.
రూ.
1164 కోట్ల విలువ చేసే మద్యం సరఫరా చేసే
ఆర్డర్ అదాన్ కంపెనీకి ఉందని, ఆ కంపెనీ వెనుక విజయసాయి రెడ్డి ఉన్నారని
పురందరేశ్వరి ఆరోపించారు. మరో కంపెనీ
ఎస్పీవై ఆగ్రోస్ సంస్థకు రూ. 1800 కోట్ల మేర సరఫరాకు ఆర్డర్ ఉందని దాని వెనుక మిథున్
రెడ్డి ఉన్నారని చెప్పారు.