PM Modi at Vijaya Dasami Ramleela Celebrations
శ్రీరామచంద్రమూర్తి మరికొద్ది నెలల్లో
తన జన్మభూమిలో విరాజమానుడవుతాడని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అయోధ్యలో
రామమందిర నిర్మాణం జరుగుతుండడాన్ని చూస్తున్న మనం ఎంతో అదృష్టవంతులమని ఆయన
వ్యాఖ్యానించారు.
దేశ రాజధానిలోని డీడీఏ గ్రౌండ్లో
ద్వారకా శ్రీరామలీలా సొసైటీ విజయదశమి సందర్భంగా నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ ‘‘వచ్చే
శ్రీరామనవమి నాటికి రామ్‌లాలా (బాలరాముడు) ఆలయం భక్తుల ప్రార్థనలతో
మార్మోగుతుంటుంది. శ్రీరామచంద్రప్రభువు తన మందిరానికి చేరుకోడానికి మరికొన్ని
నెలలు మాత్రమే సమయముంది. శ్రీరాముడు వచ్చేస్తున్నారు…’’ అని చెప్పారు.
అన్యాయంపై న్యాయం, అహంకారంపై వినయం,
క్రోధంపై సహనం విజయం సాధించిన పండుగే విజయదశమి అని ప్రధాని మోదీ అన్నారు. శ్రీరామజన్మభూమిలో
ఆయన మందిరాన్ని పునర్నిర్మించుకోవాలని ఎన్నో శతాబ్దాలుగా భారతీయులు చూపిన సహనమే ఈ విజయానికి
నిదర్శనమని మోదీ వ్యాఖ్యానించారు.
రామలీలా మైదానంలో ప్రధానమంత్రికి
కార్యక్రమ నిర్వాహకులు సంప్రదాయబద్ధమైన స్వాగతం పలికారు. ఆయనను శాలువా, రామ
దర్బారు ప్రతిమ, గద బహూకరించారు. ప్రధానమంత్రి అక్కడ పూజలో పాల్గొన్నారు. ఆ తర్వాత
రామలీలలో పాల్గొనే పాత్రధారులకు తిలకం దిద్దారు. రామలీల కార్యక్రమానికి మోదీ గతంలో
2019లో అతిథిగా వచ్చారు.
ప్రధానమంత్రి తన ప్రసంగంలో
ప్రతిపక్షాల పైన కూడా పరోక్షంగా వ్యాఖ్యలు చేసారు. దేశాన్ని కులాలు, ప్రాంతాల
పేరిట విభజించే దుష్టశక్తులను కూడా దహనం చేసే రోజు ఈ పర్వదినమే అని మోదీ అన్నారు.
‘‘మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. రావణ దహనం అంటే కేవలం ఒక దిష్టిబొమ్మను
తగులబెట్టడం కాదు. సమాజంలోని సౌహార్ద భావాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించే
ప్రతీ దుష్టభావాన్నీ తగులబెట్టాలి. కులాలు, ప్రాంతాల పేరిట దేశాన్ని విభజించే శక్తులను
తగులబెట్టాలి’’ అన్నారు.
మోదీ ఆయుధపూజకు కూడా తనదైన భాష్యం
చెప్పారు. ఆయుధాలను ఆక్రమణ కోసం కాక, కేవలం ఆత్మరక్షణ కోసమే వాడుకోవాలని హితవు
పలికారు. ‘‘విజయదశమి పర్వదినాన ఆయుధపూజ చేసే సంప్రదాయం ఉంది. భారతదేశంలో ఆయుధాలను పూజించేది
ఎవరి భూమినో లాక్కోడానికి కాదు, మన భూమిని రక్షించుకోడానికి మాత్రమే. మనం చేసే
శక్తిపూజ కేవలం మనకోసం కాదు, మొత్తం ప్రపంచ సంక్షేమం కోసం’’ అన్నారు.
సుమారు రెండు నెలల క్రితం చంద్రయాన్-3
ప్రయోగం విజయవంతమైన సంతోషాన్ని కూడా ఈ పర్వదినం నాడు ప్రధాని మరోసారి
పంచుకున్నారు. ‘‘దేశ ప్రజలందరికీ నవరాత్రి, విజయదశమి శుభాకాంక్షలు. ఈసారి మనం
చంద్రుణ్ణి జయించిన సంబరాలు కూడా చేసుకుంటున్నాం. మనకు భగవద్గీతా జ్ఞానమూ ఉంది… ఐఎన్ఎస్
విక్రాంత్, తేజస్ నిర్మించే సామర్థ్యమూ ఉంది’’ అని మోదీ వ్యాఖ్యానించారు.
వచ్చే పాతికేళ్ళలో అంటే దేశ
స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాలు జరుపుకునే నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా
ఎదగాలన్న లక్ష్యాన్ని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ‘‘అభివృద్ధి చెందిన భారతదేశం
స్వయంసమృద్ధంగా ఉంటుంది, ప్రపంచానికి శాంతి సందేశం ఇస్తుంది, ప్రజలందరికీ తమ కలలు
నెరవేర్చుకునేందుకు సమాన హక్కులు అందిస్తుంది, ప్రజలందరూ శ్రేయస్సుతో సంతృప్తితో
ఉండే అలాంటి అగ్రరాజ్యమే రామరాజ్యం దార్శనికత’’ అన్నారు.
విజయదశమి పర్వదిన సందర్భంగా ప్రజలందరూ
పది నిర్ణయాలు తీసుకోవాలని ప్రధానమంత్రి కోరారు. జల సంరక్షణ, డిజిటల్ లావాదేవీలు,
పరిశుభ్రత, స్థానిక ఉత్పాదనలకు మద్దతు, నాణ్యమైన ఉత్పత్తుల తయారీ, విదేశాల కంటె
ముందు స్వదేశానికి ప్రాధాన్యం, ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట, చిరుధాన్యాల వాడకం
పెంచడం, ఆరోగ్యంగా ఉండడం, వీటన్నిటితో పాటు చివరిగా సమాజంలో ప్రతీఒక్కరూ ఒక పేద
కుటుంబాన్ని పేదరికం నుంచి బైటపడేసేందుకు సహాయపడాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
‘‘కనీస సదుపాయాలైన ఇల్లు, విద్యుత్తు,
గ్యాస్, నీరు, వైద్య సదుపాయాలు లేని పేదప్రజలు ఉన్నంతవరకూ వారి పేదరికాన్ని
తొలగించేవరకూ తమ ప్రభుత్వం విశ్రాంతి తీసుకోబోదని ప్రధాని మోదీ తన విజయదశమి సందేశంలో
ప్రకటించారు.