వన్డే క్రికెట్ వరల్డ్ కప్(CWC)- 2023లో దక్షిణాఫ్రికా దూకుడు
కొనసాగుతోంది. మంగళవారం రాత్రి ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో
బంగ్లాదేశ్ పై దక్షిణాఫ్రికా జట్టు(BAN
VS SA) 149
పరుగుల తేడాతో విజయం సాధించింది.
బంగ్లాదేశ్
పై మ్యాచ్‌లో క్వింటన్ డి కాక్, హెన్రిచ్ క్లాసెన్ అద్భుతంగా ఆడారు.
భారీ షాట్లతో పరుగుల వరద పారించారు. డికాక్
174,
క్లాసెన్
90 పరుగులు చేశారు. ఐడెన్
మార్క్రామ్(60), డేవిడ్ మిల్లర్(34) రాణించారు. నిర్ణీత 50 ఓవర్లలో 382 పరుగుల భారీ లక్ష్యాన్ని
ప్రత్యర్థికి నిర్దేశించింది. బంగ్లా బౌలర్లు హసన్ మహమూద్ రెండు వికెట్లు తీయగా, మెహిదీ
హసన్ మిరాజ్, షారిఫుల్ ఇస్లాం, షకీబ్ అల్ హసన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
లక్ష్య
ఛేదనలో బంగ్లాదేశ్ జట్టు 46.4 ఓవర్లకు 233 పరుగులకే చతికిలపడింది.
మహ్మదుల్లా 111 పరుగులతో రాణించినప్పటికీ మిగతా వారి నుంచి సహకారం లభించలేదు. లిట్టన్
దాస్ (22), మెహిదీ హసన్ మిరాజ్(11), నసూమ్ అహ్మద్(19), తాంజిద్ హసన్(12) పరుగులకే
పెవిలియన్ చేరారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోయెట్జీ మూడు వికెట్లు తీయగా,
మార్కో జాన్సెన్, లిజాడ్ విలియమ్స్, కగిసో
రబడ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.
పాయింట్ల పట్టికలో సఫారీ జట్టు
రెండో స్థానానికి ఎగబాకింది. న్యూజీలాండ్ కూడా 5 మ్యాచ్‌లు ఆడి నాలుగు విజయాలు
సాధించినప్పటికీ రన్‌రేటు తక్కువగా ఉండడంతో మూడో స్థానానికి పడిపోయింది. ఐదు
మ్యాచ్‌లు ఆడి అన్నింటిలోనూ గెలుపొందిన భారత్ మొత్తం 10 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.
బంగ్లాదేశ్ జట్టు పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానానికి పడిపోయింది.