Mohan Bhagwat on India to show path of peace to the world
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచం
మొత్తం భారతదేశం వైపు చూస్తోందని ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు.
శాంతి మార్గాన్ని అనుసరించే భారతదేశం మార్గదర్శకత్వం కోసం ప్రపంచం ఎదురు చూస్తోందని
వివరించారు.
విజయదశమి ఉత్సవం సందర్భంగా నాగపూర్లోని సంఘ
ప్రధాన కార్యాలయంలో జరిగిన ఉత్సవంలో భాగవత్ ప్రసంగించారు. రకరకాల సంక్షోభాల్లో
చిక్కుకుపోయిన ప్రపంచం భారతదేశం వైపు చూస్తోందని ఆయన చెప్పారు. భారతదేశం తనకే
సొంతమైన విలువల ఆధారంగా కొత్త దార్శనికతను ఆవిష్కరిస్తుందనీ, ఆ దార్శనికత ప్రపంచం
ఎదుర్కొంటున్న సవాళ్ళను పరిష్కరించి వర్తమాన అవసరాలను తీరుస్తుందనీ…. ప్రపంచం ఆశిస్తోందని
భాగవత్ చెప్పారు.
‘‘మతపరమైన విభజనల నుంచి పుట్టుకొచ్చిన ఉన్మాదం,
అహంకారం, మౌఢ్యం అనే ఉపద్రవాలను ప్రపంచం ఎదుర్కొంటోంది. అతివాదం వల్లనో, ప్రయోజనాల
మధ్య ఘర్షణల వల్లనో తలెత్తే… ఉక్రెయిన్ యుద్ధం లేదా గాజాలో యుద్ధం వంటి…
సంక్షోభాలకు పరిష్కారం ఎండమావే. ప్రకృతితో సమన్వయం లేని జీవనవిధానం, విశృంఖల వినిమయతత్వం
కొత్తతరహా శారీరక, మానసిక సమస్యలు కలగజేస్తున్నాయి. ఉగ్రవాదం, దోపిడీ, నిరంకుశత్వం…
బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. సరైన దార్శనికత లేని కారణంగా ప్రపంచం ఈ సమస్యలను ఎదుర్కోలేకపోతోందన్న
సంగతి రోజురోజుకూ స్పష్టమవుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రపంచం భారతదేశం వైపు
చూస్తోంది. సనాతన విలువలు, సంస్కారాల ఆధారంగా శాంతి సౌభాగ్యాల కొత్త దారిని భారతదేశం
చూపిస్తుందని ప్రపంచం ఆశిస్తోంది’’ అని మోహన్ భాగవత్ వివరించారు.
హింస, దౌర్జన్యాలపై పోరాడడానికి సమాజంలో ఒక
వ్యవస్థీకృత శక్తి కావాలి, అలాంటి శక్తి ప్రభుత్వానికి తగిన మద్దతునివ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు.
‘‘రెచ్చగొట్టేవాళ్ళు, ప్రేరేపించేవాళ్ళూ ఉంటూనే ఉంటారు. కానీ చట్టాన్నీ న్యాయాన్నీ
అనుసరించడం, రాజ్యాంగానికి కట్టుబడి ఉండడం, క్రమశిక్షణతో మసలుకోవడం తప్పనిసరి. స్వతంత్ర
దేశంలో అటువంటి ప్రవర్తనే దేశభక్తిని ప్రకటించడం అనిపించుకుంటుంది. హింస,
దౌర్జన్యాలకు సరైన పరిష్కారం ఏంటంటే సమాజం ఒక వ్యవస్థీకృతమైన శక్తిగా ఎదగాలి, చట్టాన్నీ
న్యాయాన్నీ రక్షించుకోడానికి ముందడుగు వేయాలి, ప్రభుత్వానికీ, పరిపాలనా వ్యవస్థకూ
తగిన సహాయం అందించాలి’’ అన్నారు.
ప్రసార మాధ్యమాలను అడ్డుపెట్టుకుని విద్వేష
ప్రచారం చేయడం, దానివల్ల తలెత్తే ఆరోపణలు, ప్రత్యారోపణల విషవలయంలో చిక్కుకునిపోవడం
సరైనది కాదని మోహన్ భాగవత్ అన్నారు. ప్రసారమాధ్యమాలు సహితం సత్యాన్నే ప్రచారం
చేయాలనీ, సమాజంలో సౌహార్దత కోసం కృషి చేయాలనీ ఆయన హితవు పలికారు.