Mohan Bhagwat on Cultural Marxists and Wokists
భారతదేశం స్వయంసమృద్ధం కాకూడదని కోరుకునే
కొంతమంది తమను తాము సాంస్కృతిక మార్క్సిస్టులుగానూ, వోకిస్టులుగానూ చెప్పుకోడాన్ని
ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భాగవత్ గమనించారు. వారే సమాజంలో వివక్షను, విభజననూ సృష్టించడానికి
ప్రయత్నిస్తున్నారనీ, అటువంటివారు 1920లలోనే కారల్ మార్క్స్‌ను మరచిపోయారనీ మోహన్
భాగవత్ వ్యాఖ్యానించారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యవస్థాపక దినాన
నాగపూర్ సంఘ కార్యాలయంలో నిర్వహించిన విజయదశమి ఉత్సవం సందర్భంగా మోహన్ భాగవత్
ప్రసంగించారు. దేశం కోసం నిస్వార్థంగా పనిచేసే మేధావులు… వారు సంఘీయులైనా,
కమ్యూనిస్టులైనా కావచ్చు… అటువంటి వారిని ఈ సాంస్కృతిక మార్క్సిస్టులు లేదా
వోకిస్టులు వ్యతిరేకిస్తూనే ఉంటారని చెప్పారు.
‘‘వర్తమాన పరిస్థితుల్లో మనం మన దేశీయ విలువలకు కట్టుబడి
మార్పును తీసుకువస్తే, అది ప్రపంచానికే మేలు చేస్తుంది. ఆ పని ప్రారంభమయింది. కానీ
ప్రపంచంలోనూ, మన దేశంలో కూడా కొంతమంది ఉన్నారు. మన దేశం సొంత కాళ్ళమీద నిలబడడం
వారికి ఇష్టం ఉండదు. వాళ్ళు సమాజంలో వివక్ష సృష్టించడానికి ప్రయత్నిస్తారు. సమాజపు
నిర్మాణాత్మక సమష్టితత్వాన్ని ఎలా విచ్ఛిన్నం చేయాలి, సమాజంలో విభజనను, ఘర్షణలను
ఎలా సృష్టించాలి అని వారు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈ విభజన శక్తులు తమను
తాము సాంస్కృతిక మార్క్సిస్టులు లేక వోకిస్టులు (జాగృతమైన వారు) అని
పిలుచుకుంటారు. కానీ నిజానికి వారు మార్క్స్‌ను 1920లలోనే మరచిపోయారు. సమాజంలో
క్రమశిక్షణ, నైతికత, ఉపకార బుద్ధి, సంస్కృతి, హుందాతనం, నియంత్రణ వంటి అన్నింటినీ వారు
వ్యతిరేకిస్తున్నారు. మొత్తం మానవాళి మీద అతికొద్దిమందికి పూర్తి అధికారం ఉండడం
కోసం వారు అరాచకత్వాన్ని, విచక్షణా రాహిత్యాన్నీ ప్రచారం చేస్తున్నారు’’ అని మోహన్
భాగవత్ చెప్పారు.
‘‘వారు పనిచేసే విధానం ఇలా ఉంటుంది. మొదట వారు ప్రసార
మాధ్యమాలను, విద్యావ్యవస్థలనూ తమ నియంత్రణలోకి తెచ్చుకుంటారు. విద్యా, సాంస్కృతిక, రాజకీయ, సామాజిక వాతావరణాన్ని
అయోమయంలో పడవేస్తారు, అరాచకం సృష్టిస్తారు, అవినీతి కూపాలుగా మార్చివేస్తారు.
అలాంటి వాతావరణంలో భయం, అయోమయం, విద్వేషం ప్రబలుతాయి. పరస్పర విభేదాలు, ఘర్షణల్లో
కూరుకుపోయి విభజితమైపోయే సమాజం చాలా సులువుగా బలహీనపడిపోతుంది, తనకు తెలియకుండానే
ఈ విధ్వంసక శక్తులకు ఎరగా మారిపోతుంది. ఇలా అవిశ్వాసం, అయోమయం, పరస్పర ద్వేషం కల్పించి
దేశాన్ని విచ్ఛిన్నం చేసే విదానాన్ని భారతీయ సంప్రదాయంలో మంత్రవిప్లవం అంటారు’’
అని మోహన్ భాగవత్ వివరించారు.
అటువంటి సాంస్కృతిక మార్క్సిస్టులు
లేక వోకిస్టుల వల్ల దేశానికి ప్రమాదం పొంచివుందని, వారిపట్ల సమాజం జాగ్రత్తగా
ఉండాలనీ భాగవత్ హెచ్చరించారు.