RSS Chief Mohan Bhagwat @ Vijaya Dasami Utsav
భారతదేశంలోని ప్రజలందరూ ఒకే పూర్వీకుల వారసులని
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్సంఘచాలక్ మోహన్ భాగవత్ గుర్తుచేసారు. భారతమాత పట్ల
భక్తే దేశప్రజలు అందరినీ కలిపి ఉంచుతుందని, దానికి కులం, మతం, ప్రాంతం వంటి వాటితో
సంబంధం లేదనీ భాగవత్ చెప్పారు.
విజయదశమి పర్వదిన వేళ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
వ్యవస్థాపనా దినోత్సవం మహారాష్ట్రలోని నాగపూర్లో జరిగింది. ఆ సందర్భంగా మోహన్
భాగవత్ ప్రసంగించారు. తన ప్రసంగంలో మోహన్ భాగవత్ పలు విషయాలను ప్రస్తావించారు.
‘‘ఒకవైపు పర్వతం, మూడువైపుల సముద్రాలూ ఉన్న
భౌగోళిక పరిస్థితి భారతదేశానికి సహజమైన రక్షణ కల్పించింది. అలాంటి రక్షణలో ఉన్న దేశీయులు
తమ జీవితాల్లో ఎక్కువ సమయం తమ లోపలి అంతర్గత సత్యాన్ని అన్వేషించడానికే అంకితం
చేసారు. ఈ విశ్వమంతా ఒక్కటే అన్న భావన ఆ అన్వేషణ నుంచే జనించింది. ఇది భారతమాత
మనకు ప్రసాదించిన ఆశీర్వాదం. భారతమాత పట్ల భక్తే మన అందరినీ కలిపి ఉంచే సూత్రం.
అన్ని కులాలు, మతాలు, వర్గాలకూ అది వర్తిస్తుంది’’ అని మోహన్ భాగవత్ చెప్పారు.
మన దేశ సంస్కృతిని, నాగరిక వారసత్వాన్నీ పరిరక్షించడానికి శ్రమించిన వారి అడుగుజాడలను దేశప్రజలు
అనుసరించాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ పిలుపునిచ్చారు. ‘‘మూడు అంశాలు ప్రధానమైనవి. మాతృదేశం పట్ల భక్తి, మన పూర్వీకుల పట్ల గర్వం,
మనందరి ఉమ్మడి సంస్కృతి మనను ఒక జాతిగా కలిపి ఉంచుతున్నాయి. భాష, ప్రాంతం, మతం,
వర్గం, కులం, ఉపకులం వంటి భిన్నత్వాలు ఎన్ని ఉన్నా మౌలికంగా మనందరిలోనూ ఆ ఐక్యభావన
ఉంది. బైటనుంచి వచ్చిన మతాలను అనుసరించేవారు కూడా ఈ మూడు అంశాలనూ అనుసరించి తీరాల్సిందే’’
అని భాగవత్ తన ప్రసంగంలో స్పష్టంగా చెప్పారు.
సత్యం, సహానుభూతి, బాహ్య-అంతరంగాల్లో నిత్యంశుద్ధంగా
ఉండే పవిత్రత, తపస్సు… ఈ నాలుగూ భారతీయమైన అన్ని ధార్మిక విశ్వాసాలకూ ముఖ్యమైన
నియమాలు అని భాగవత్ స్పష్టం చేసారు. ‘‘ఆ విలువలతో మన పూర్వీకులు బ్రతికారు. వాటివల్లే
మన దేశం అభివృద్ధి చెందింది. మనం కూడా అవే విలువలతో జీవించి తీరాలి’’ అని భాగవత్
చెప్పారు.
‘‘భారతదేశంలోనే ఎన్నో విశ్వాసాలు ఉన్నాయి. విదేశీ దండయాత్రల తర్వాత మరికొన్ని
విశ్వాసాలు, అప్పటికే ఉన్నవాటికి తోడయ్యాయి. మనం అందరినీ కలుపుకుంటాం, అందరినీ ఆమోదిస్తాం.
భారతమాత పట్ల భక్తి అందరికీ వర్తిస్తుంది. మనందరమూ ఒకే పూర్వీకులకు వారసులం.’’ అన్నారాయన.
‘‘ప్రపంచంలో మిగతా దేశాలు ఐక్యత సాధించడానికి మతం, భాష వంటి ప్రాతిపదికలను
కనుగొన్నాయి. కానీ అవేవీ అంత మాతృదేశభక్తి అంతటి బలమైన ప్రాతిపదికలు కావు. పైగా, ఆ
దేశాల్లో వైవిధ్యం అంత ఎక్కువేమీ కాదు. ఎన్నో భాషలు, తెగలు, సమాజాలు, ఆచారాలు,
రీతిరివాజులూ ఉన్నప్పటికీ ఎన్నో శతాబ్దాలుగా భారతదేశం ఐకమత్యంగా ఉంటూ వస్తోంది.
అది ఎలా సాధ్యమన్నది వారికి అర్ధం కాదు. వాళ్ళను ఆశ్చర్యపరిచేదీ, ఆకర్షించేదీ ఆ
ఐకమత్యమే’’ అన్నారాయన.
మోహన్ భాగవత్ తన ప్రసంగంలో 2024లో జరగబోయే లోక్సభ ఎన్నికల గురించి
ప్రస్తావించారు. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్లు సాధించేందుకు చేసే
ప్రయత్నాలు మంచివి కావని ఆయన హితవు పలికారు. ‘‘అలాంటి చర్యలను మనం వదిలివేద్దాం.
అవి సమాజపు ఏకత్వాన్ని దెబ్బతీస్తాయి. ఓటు వేయడం ప్రతీ పౌరుడి విధి. మనందరం ఆ
విధిని అనుసరిద్దాం. దేశ ఏకత్వం, సమగ్రత్వం, అస్తిత్వం, అభివృద్ధి వంటి కీలకమైన
అంశాలను దృష్టిలో ఉంచుకుని ఓటు వేయండి’’ అని పిలుపునిచ్చారు.
భారతదేశం ఇటీవల జి-20 సదస్సును విజయవంతంగా నిర్వహించడాన్ని కూడా మోహన్ భాగవత్
తన ప్రసంగంలో పేర్కొన్నారు. ‘‘భారతీయుల ఆతిథ్యాన్ని అందరూ మెచ్చుకున్నారు. వివిధ
దేశాల వారు మన దేశపు వైవిధ్యాన్ని తెలుసుకున్నారు. మన దేశపు దౌత్యనైపుణ్యాలను, మన
నిజాయితీని ప్రత్యక్షంగా చూసారు. మన నాయకత్వం ప్రపంచ పటంలో భారత్కు గౌరవప్రదమైన
స్థానాన్ని కల్పించింది’’ అన్నారు.
భాగవత్ తన ప్రసంగంలో భారత్ ఎదుర్కొంటున్న సమస్యలను సైతం ప్రస్తావించారు. ‘‘భారతదేశం
ఎదగకూడదని, ముందుకు వెళ్ళకూడదని కోరుకునేవారు కొంతమంది ఈ ప్రపంచంలో ఉన్నారు, మన
దేశంలో కూడా ఉన్నారు. వారు సమాజంలో విభేదాలు, ఘర్షణలూ సృష్టించడానికి
ప్రయత్నిస్తారు. మన అజ్ఞానం వల్ల, అవిశ్వాసం వల్ల కొన్నిసార్లు మనం ఆ ఉచ్చులో
చిక్కుకుపోతాం. దానివల్ల అనవసరమైన గొడవలు కలుగుతాయి. భారత్ అభివృద్ధి చెందితే అలాంటి
వారి ఆటలు సాగవు. అందుకే వారు నిరంతరం వ్యతిరేక ధోరణితోనే ప్రవర్తిస్తూ ఉంటారు.
కేవలం వ్యతిరేకించడం కోసమే వారు కొన్ని భావజాలాలకు కట్టుబడతారు’’ అని వివరించారు
భాగవత్.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యవస్థాపనా దినోత్సవం, వార్షిక
విజయదశమి ఉత్సవ కార్యక్రమం స్వయంసేవకుల పథ సంచలనంతో ప్రారంభమైంది. కార్యక్రమం
ప్రారంభంలో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేశవ బలీరాం హెడగేవార్కు నివాళులర్పించారు.
విజయదశమి సందర్భంగా ఆయుధపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ యేడాది ఉత్సవానికి ప్రముఖ
గాయకుడు, సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర మంత్రి
నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా పాల్గొన్నారు.