ద్వారక తిరుమల(Dwaraka Tirumala)లో
చినవెంకన్న ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు(Brahmotsavam )
ప్రారంభమయ్యాయి. ఈ నెల 29 వరకు భక్తిశ్రద్ధలతో
ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. 26న స్వామి తిరుకళ్యాణం, 27న రథోత్సవం జరుపుతారు. 28న
చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని అధికారులు మూసివేస్తారు. 29న ఆలయాన్ని శుద్ధి చేసిన
అనంతరం మళ్ళీ పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. రాత్రికి ద్వాదశ కోవెల
ప్రదక్షిణలు, పవళింపు సేవతో ఉత్సవాలు సమాప్తమవుతాయి.
ద్వారక తిరుమలలో కొలువైన శ్రీవేంకటేశ్వర స్వామికి
ప్రతినిత్యం వేలాది మంది భక్తులు మొక్కులు చెల్లిస్తారు. తిరుమల వెళ్ళలేని వారు ఇక్కడ మొక్కు చెల్లిస్తే కలియుగ
వేంకటేశ్వురుడి అనుగ్రహం కల్గుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ ప్రదేశంలో ద్వారక
మహర్షి చాలా కాలంపాటు తపస్సు చేయడంతో ఆయన చుట్టూ పెద్ద పుట్టు పెరిగింది. ఆయన కఠోర
తపస్సుకు మెచ్చి శ్రీవేంకటేశ్వరస్వామి ఇక్కడ స్వయంభువుగా వెలిసి
పూజలందుకుంటున్నారు.
స్వామి వారి నడుమభాగం వరకు పుట్టతో కప్పివేయబడి ఉండటం
ఇక్కడ విశేషం.
విష్ణు సేవలో పాద పూజకు ప్రాధాన్యం ఉంటుంది.
స్వామివారి పాదాలు వల్మీకంలో ఉండటంతో పాదపూజకు
వీలు కుదరని పరిస్థితి. దీంతో వేద
పండితులు తిరుపతి నుంచి మరొక మూర్తిని తీసుకొచ్చి స్వయంభూ మూర్తి వెనుక భాగంలో
ప్రతిష్టించారు. దీంతో స్వామి వారు ఇద్దరు ధ్రువమూర్తులుగా చిన తిరుపతిలో
దర్శనమిస్తారు. అందుకే ఇక్కడ ఏడాదికి రెండు పర్యాయాలు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
వైశాఖ, ఆశ్వయుజ మాసలలో అత్యంత శోభాయమానంగా స్వామికి బ్రహ్మోత్సవాలు జరుపుతారు.