ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులను లెక్కల్లో చూపడం లేదని బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి,కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఫిర్యాదు చేశారు. ఏపీ అప్పులు రూ.4.42 లక్షల కోట్లు మాత్రమేనని వైసీపీ ప్రభుత్వం ఆర్‌బిఐకు వెల్లడించిందని ఆమె గుర్తుచేశారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పులను లెక్కల్లో చూపడం లేదని, దీనిపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు పురందేశ్వరి ఓ నివేదికను అందజేశారు.
బేవరేజెస్ కార్పొరేషన్‌లాంటి వివిధ కార్పొరేషన్ల ద్వారా ఏపీ ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు రూ.10.77 లక్షల కోట్లకు చేరుకుందని పురందేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుల కోసం రాబోయే 30 సంవత్సరాల పాటు ఏటా రూ.36 వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రభుత్వాన్ని నడపడం కూడా కష్టం అవుతుందని ఆమె తెలిపారు. నాలుగేళ్ల కిందట పనులు చేసిన కాంట్రాక్టర్లకు నేటికీ బిల్లులు చెల్లించలేదని కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి వేదిస్తున్నారని ఆమె అన్నారు.
ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం అన్ని మార్గాల ద్వారా తెచ్చిన అప్పులపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు. మరోవైపు మద్యం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన రూ.30 వేల కోట్ల ఆదాయాన్ని లెక్కల్లో చూపడం లేదని ఆమె అన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు.