చైనాలోని హాంగ్ జౌ వేదికగా జరుగుతోన్న పారా ఆసియన్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. భారత క్రీడాకారులు ఇవాళ 2 స్వర్ణాలు సాధించారు. సోమవారం కానో వీఎల్2 విభాగంలో రజతం గెలిచిన ప్రాచీ, కేఎల్2 ఈవెంట్లో స్వర్ణం కైవసం చేసుకుంది. మహిళల 400 మీటర్ల పరుగును దీప్తి 56.69 సెకన్లలో పూర్తి చేసి ఆసియా రికార్డుతో స్వర్ణం సాధించింది. పురుషుల 400 మీటర్ల విభాగంలో అజయ్ కుమార్, సిమ్రాన్ శర్మ 100 మీటర్ల విభాగంలో రజతం సాధించారు. ప్రాచీ భర్త మనీష్ కౌరవ్ పురుషుల కేఎల్3 కానో, గజేంద్ర సింగ్ వీఎల్2 కానో, ఏక్తా భయన్ ఎఫ్ 32/51 క్లబ్ త్రోలో కాంస్య పతకాలు సాధించారు.
భారత్ ఇప్పటి వరకు 24 పతకాలు సాధించింది. వీటిలో 8 స్వర్ణాలు, 8 రజతాలు, 8 కాంస్య పతకాలున్నాయి. పారా ఆసియన్ గేమ్స్ తొలిరోజు భారత్ 17 పతకాలు సాధించి, పతకాల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. సోమవారం నాడు ప్రణవ్ సూర్య, శైలేష్ కుమార్, నిషాద్ కుమార్, అంకుర్ ధామా, ప్రవీణ్ కుమార్‌లు వివిధ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించారు.