తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి 7
గంటల వరకూ పారువేట ఉత్సవం నిర్వహిస్తారు. శ్రీశైలంలో మల్లికార్జున సమేత
భ్రమరాంబికా దేవికి ఈ రాత్రి తెప్పోత్సవం నిర్వహిస్తారు.
సాధారణంగా పారువేట ఉత్సవం మకర సంక్రమణ పర్వదిన సమయంలో కనుమ పండుగ నాడు
నిర్వహిస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. అయితే అధికమాసం కారణంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు,
నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించే సందర్భాల్లో పారువేట రెండోసారి కూడా
జరుపుతారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన మర్నాడు ఈ ఉత్సవం జరపడం తిరుమలలో ఆనవాయితీగా
వస్తోంది.
ఈ యేడాది తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిన్న సోమవారం చక్రస్నాన ఘట్టంతో ముగిసాయి.
స్వామివారితో పాటు భక్తులు విశేష సంఖ్యలో పుష్కరిణిలో స్నానం చేసారు. అంతకుముందు, తెల్లవారుజామున
4 నుంచి 6 గంటల వరకూ స్వామివారికి పల్లకీ ఉత్సవం జరిగింది. 6 గంటల నుంచి 9 గంటల
వరకూ వరాహస్వామి ఆలయంలో శ్రీదేవీ భూదేవీ సమేత మలయప్ప స్వామికి, సుదర్శన
చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజన కార్యక్రమం నిర్వహించారు.
శ్రీశైలంలో శరన్నవరాత్రి
మహోత్సవాలు నేటితో ముగుస్తాయి. ఇవాళ విజయదశమి సందర్భంగా భ్రమరాంబికాదేవి నిజరూప అలంకారంలో
ఈ సాయంత్రం భక్తులకు
దర్శనమివ్వనున్నారు. నందివాహనంపై ఆసీనులై మల్లికార్జున స్వామి భ్రమరాంబికా దేవి పూజలందుకొంటారు. ఈ రాత్రి స్వామి అమ్మవార్ల తెప్పోత్సవంతో దసరా మహోత్సవాలు
ముగుస్తాయి.