విజయవాడ ఇంద్రకీలాద్రిపై సోమవారం
సాయంత్రం హంసవాహన సేవతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిసాయి.
సోమవారం ఉదయం నవమి, రాత్రి దశమి
తిథిద్వయం రావడంతో… మహర్నవమి, విజయ దశమి రెండు పర్వదినాలనూ ఒకేరోజు నిర్వహించారు.
అమ్మవారు ఉదయం మహర్ననవమి సందర్భంగా మహిషాసుర మర్దినీ అవతారంలో దర్శనమిచ్చారు.
అక్కడితో నవరాత్రి ఉత్సవాలు ముగిసాయి. దానికి సూచనగా అర్చకులు శాస్త్రోక్తంగా వైదిక
సంప్రదాయబద్ధంగా మహాపూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. మహర్నవమి పూర్తి,
నవరాత్రుల పరిసమాప్తి, పూర్ణాహుతి అయిన తర్వాత… అమ్మవారి అలంకారం మార్చడం కోసం
దర్శనాలు కొద్దిసేపు నిలిపివేసారు.
సాయంత్రం విజయదశమి పర్వదినం
సందర్భంగా కనకదుర్గా దేవిని శ్రీరాజరాజేశ్వరిగా అలంకరించారు. వామహస్తంలో చెరకుగడ
ధరించి దక్షిణహస్తంలో అభయముద్రతో షోడశాక్షరీ మహామంత్ర స్వరూపిణిగా, శ్రీచక్రరాజ అధిష్ఠాన దేవతగా శ్రీరాజరాజేశ్వరీదేవి
భక్తులను అనుగ్రహించారు.
దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా విజయదశమి సోమవారం
రాత్రి ఇంద్రకీలాద్రి అధిష్ఠాన దేవత కనకదుర్గాదేవి, మల్లేశ్వర
స్వామి వార్లకు కృష్ణానదిలో హంసవాహనసేవ నిర్వహించారు. ఈ జలవిహారం భక్తుల కన్నులపండువగా
జరిగింది. తెప్పోత్సవంగా పిలిచే హంసవాహనసేవలో త్రిలోక సంచారానికి గుర్తుగా శ్రీ
కనకదుర్గా మల్లేశ్వర స్వామివార్లను మూడుసార్లు జలవిహారం చేయించారు.