మణాపూర్ హింస (Manipur Riots) వెనుక విదేశీ శక్తుల హస్తం ఉండే అవకాశం లేకపోలేదని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నో దశాబ్దాలుగా మణిపూర్‌లో మెయితీలు, కుకీలు కలసి ఉంటున్నారని, ఒక్కసారిగా హింస ఎలా చెలరేగిందంటూ ఆయన ప్రశ్నించారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని నాగపూర్ ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మోహన్ భాగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మణిపూర్‌లో హింస జరగలేదని, కొందరు అక్కడ హింస జరిగేలా చేస్తున్నారని భాగవత్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ హింసలో విదేశీ శక్తుల పాత్ర ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ఇటువంటి పరిస్థితులు విదేశీ శక్తులకే లాభిస్తుందని భాగవత్ చెప్పారు. కొందరు సంఘ వ్యతిరేక శక్తులు సాంస్కృతిక మార్క్సిస్టులుగా చెప్పుకుంటున్నారని ఆయన అన్నారు. అలాంటి వారు మార్క్స్‌ను మరచిపోయారని భాగవత్ ఎద్దేవా చేశారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నారని మోహన్ భాగవత్ ధ్వజమెత్తారు. ఇలాంటి వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దేశ సమగ్రత, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఓటేయాలని భాగవత్ సలహా ఇచ్చారు.