బందీలను వదిలేయాలంటూ ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో హమాస్ (hamas) ఉగ్రవాదులు ఇవాళ ఇద్దరు బందీలను వదిలిపెట్టారు. సోమవారం రాత్రి గాజాలో హమాస్ వద్ద బందీలుగా ఉన్న ఇద్దరు మహిళలను ఉగ్రవాదులు వదిలిపెట్టారు. మానవతా కారణాలతో ఇద్దరు మహిళలను వదిలిపెడుతున్నట్లు హమాస్ ప్రకటించింది. ఖతార్, ఈజిప్టు దేశాల మధ్యవర్తిత్వం చేయడంతో ఇద్దరు మహిళలను వదిలిపెట్టారు.
తమ వద్ద బందీలుగా ఉన్న ఇద్దరు వృద్ధ మహిళలను ఈజిప్టు సరిహద్దు రఫా వద్ద వదలిపెట్టారు. ఖతార్ సంప్రదింపుల వల్ల ఇటీవల ఇద్దరు అమెరికా పౌరులను హమాస్ ఉగ్రవాదులు వదిలిపెట్టారు. మరో 50 మందిని కూడా వదిలిపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ద్వంద్వ పౌరసత్వం ఉన్న వారిని విడిపించేందుకు రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు హమాస్ ఉగ్రవాద సంస్థతో సంప్రదింపులకు వెళుతున్నట్లు సమాచారం అందుతోంది.
హమాస్ ఉగ్రవాదుల చెరలో ఇంకా 220 మందికిపైగా బందీలుగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇది సరైన సమాచారం కాకపోవచ్చని ఇజ్రాయెల్ చెబుతోంది. హమాస్ ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఇజ్రాయెల్ ఇప్పటికే భూతల దాడులు ప్రారంభించింది. భూతుల దాడులు తీవ్రం కాకముందే బందీలను విడిపించేందుకు పలు దేశాలు మధ్వవర్తిత్వం చేస్తున్నాయి.