అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదుల మెరుపుదాడి తరవాత ఆ ప్రాంతంలో యుద్ధం తీవ్రమైంది. హమాస్ (Hamas) ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు ఇజ్రాయెల్ భీకరదాడులు చేస్తోంది. హమాస్ దాడుల వెనుక ఇరాన్ సహకారం ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అమెరికా సెనెటర్ లిండ్సే గ్రాహం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌పైకి ఉగ్రవాద సంస్థలను ఎగదోస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని లిండ్సే గ్రాహం ఇరాన్‌ను హెచ్చరించారు. టెల్ అవీవ్ పర్యటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మేం మిమ్మల్ని గమనిస్తున్నాం.ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం తీవ్రతరమైతే, అది మీ వరకు వస్తుందని లిండ్సే గ్రాహం ఇరాన్‌ను హెచ్చరించారు. ఇరాన్ ప్రమేయం లేకుండా హమాస్ ఇజ్రాయెల్‌పై దాడులు చేసిందంటే హాస్యాస్పదం అవుతుందని ఆయన అన్నారు. ఉగ్ర సంస్థలను ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలోకి దింపితే యుద్ధం మరింత విస్తరించే అవకాశం ఉందన్నారు.
హమాస్, హిజ్బొల్లా ఉగ్రవాదులకు ఇరాన్ సహకారం ఉందని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా దేశాల మధ్య ఒప్పందాలు జరిగితే, ఇరాన్‌కు ఎదురుదెబ్బ తగులుతుంది. ఆ ఒప్పందాలను నిలువరించేందుకే ఇరాన్, హమాస్ ఉగ్రదాడులు చేయించిందనే విశ్లేషణలు సాగుతున్నాయి. అయితే హమాస్ దాడి వెనుక తమ హస్తం లేదని ఇరాన్ స్పష్టం చేసింది.