పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వాయుగుండం ఈశాన్య దిశగా గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని ఐఎండీ అధికారులు తెలిపారు. ఇవాళ ఉదయం 8 గంటలకు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తీవ్ర వాయుగుండం ఒడిషాలోని పారాదీప్‌కి దక్షిణంగా 360 కి.మీ దూరంలో, దిఘాకి 510 కి.మీ దూరంలో ఉంది.
నైరుతి బెంగాల్, బంగ్లాదేశ్‌కి దక్షిణ నైరుతి దిశలో 660 కి.మీ దూరంలో ఈ వాయుగుండం కేంద్రీకృతమై ఉంది . ఇది మరింత బలపడి రాబోయే 6 గంటల్లో తుఫాను (cyclone)గా మారనుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ ఖేపుపరా, చిట్టగాంగ్ మధ్య బంగ్లాదేశ్‌లో అక్టోబరు 25వ తేదీ సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేశారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంతోపాటు, ఉపరితల ద్రోణి ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపారు.ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో ఉత్తర కోస్తాలో , యానాంలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది.దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.