తెలుగుదేశం, జనసేన పార్టీ సమన్వయ కమిటీల తొలి సమావేశం ఇవాళ రాజమహేంద్రవరంలో జరగనుంది. ఈ సమావేశానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. వీరితోపాటు రెండు పార్టీలకు చెందిన 12 మంది ముఖ్య నేతలు కూడా హాజరుకానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు రాజమహేంద్రవరంలోని మంజీర హోటల్లో ఈ సమావేశం జరగనుంది. ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ రాజమహేంద్రవరం చేరుకోగా, పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం ఒంటిగంటకు రానున్నారు.
రాబోయే ఎన్నికల్లో టీడీపీ,జనసేన కలసి పోటీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికలకు రెండు పార్టీలు కలసి ఎలాంటి పోరాటాలు, ఉద్యమాలు చేయాలనే అంశంపై చర్చించే అవకాశం ఉంది. పార్టీ నాయకులపై వైసీపీ ప్రభుత్వం పెడుతోన్న అక్రమ కేసులపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల వరకు రెండు పార్టీలు కలసి కొన్ని సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో ఆ పార్టీ బాధ్యతలు లోకేశ్ చూస్తున్నారు. ఇవాళ చంద్రబాబుతో రాజమండ్రి జైలులో లోకేశ్ ములాఖత్ అయ్యారు. రెండు పార్టీల ముఖ్య నేతలు సమావేశం కానుండటంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.