BJP delegation to TN
తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కళగం అధికారంలోకి
వచ్చిన నాటి నుంచీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయి. వాటిని
పరిశీలించి, డీఎంకే దాష్టీకాలను క్రోడీకరించడానికి బీజేపీ ఒక బృందాన్ని
పంపిస్తోంది. ఆ బృందం తమిళనాట క్షేత్ర పరిస్థితులను అధ్యయనం చేసి, పార్టీ జాతీయ
నాయకత్వానికి నివేదిక సమర్పిస్తుంది.
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, డీఎంకే
అవినీతి విధానాలను వెలికితీస్తూ, హిందూ వ్యతిరేక డీఎంకే విధానాలను ప్రశ్నిస్తూ
ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారు. దాంతో డీఎంకే అధినాయకత్వంలో కలవరం మొదలైంది.
కమల దళ కార్యకర్తలపై దాడులు పెరిగాయి. తప్పుడు కేసుల్లో అక్రమంగా ఇరికించి
బాధిస్తున్న ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి.
డీఎంకే అవినీతి గురించి చర్చ జరగకుండా ఉండేందుకు,
ముస్లిం క్రైస్తవ వర్గాల సంతుష్టీకరణ విధానాలపై హిందువులు దృష్టి సారించకుండా
ఉండేందుకు. డీఎంకే అధిష్టానం కొత్తకొత్త ఎత్తుగడలు వేస్తోంది. తమిళనాడు బీజేపీ
అధ్యక్షుడు అన్నామలై, డీఎంకే ఫైల్స్ పేరుతో బైటపెడుతున్న తమ పార్టీ అవినీతి
వ్యవహారాల నుంచి ప్రజల దృష్టి మరలించడానికి డీఎంకే రకరకాలుగా ప్రయత్నిస్తోంది. సనాతన
ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు ఆ నేపథ్యంలో చేసినవే.
హిందూ పండుగలను, హిందూ కార్యకలాపాలను నియంత్రించే
చర్యలు సైతం కొనసాగుతున్నాయి. దసరా పర్వదినాల సందర్భంగా ఆయుధపూజపై ఆంక్షలు
విధించడం, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వార్షిక కార్యక్రమాలను అడ్డుకోవడం అలాంటి
చర్యలే. ద్రవిడనాడుకు భారతదేశంతో సంబంధం లేదని తాము చేసే ప్రచారానికి భిన్నంగా
హిందువుల్లో చైతన్యం కలిగించే ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ, ఆరెస్సెస్ డీఎంకేకు
కంటగింపుగా మారాయి. అందుకే ఆ సంస్థల కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని రకరకాలుగా
వేధిస్తోంది.
ఈ విషయాన్ని సమగ్రంగా అధ్యయనం చేయడానికి బీజేపీ
జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా, నలుగురు సభ్యుల బృందాన్ని తమిళనాడుకు
పంపించాలని నిర్ణయించి, ఆ మేరకు ఆదేశించారు. ఆ బృందంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి,
కేంద్ర మాజీ మంత్రి సదానంద గౌడ, ముంబై మాజీ పోలీస్ కమిషనర్ సత్యపాల్ సింగ్,
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి, పార్లమెంటు సభ్యులు
పీసీ మోహన్ ఉన్నారు.
ఈ బృందం త్వరలోనే తమిళనాడులో పర్యటించి, తమ
నివేదికను వీలైనంత త్వరగా పార్టీ కేంద్ర నాయకత్వానికి సమర్పిస్తారు. ఆ నివేదిక
ఆధారంగా, పార్టీపరంగా తీసుకోవలసిన చర్యల గురించి నడ్డా నిర్ణయం తీసుకుంటారు.