వైసీపీ నేతల అరాచకాలకు హద్దేలేకుండా పోయింది. చివరకు పుణ్యక్షేత్రాలను కూడా వదలడం లేదు. తాజాగా చిన్న తిరుపతిగా పిలుచుకునే ద్వారకా తిరుమల (Dwaraka Tirumala) పుణ్యక్షేత్రంలో ఏలూరు వైసీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్ జన్మదిన వేడుకలు కలకలం రేపాయి. వేలాది మంది అనుచరులతో ద్వారకా తిరుమల చేరుకున్న ఎంపీ శ్రీధర్ అక్కడే వారికి విందు ఏర్పాటు చేశారు. వేలాది మంది వైసీపీ జెండాలు, టీ షర్టులు ధరించి దేవస్థానం వద్దకు చేరుకున్నారు. ఎంపీ జన్మదిన వేడుకల్లో గోపాలపురం, ఏలూరు, ఉంగుటూరు, నూజివీడు ఎమ్మెల్యేలు, వారి అనుచరులు కూడా పాల్గొన్నారు.
పది వేల మంది వైసీపీ కార్యకర్తలకు దేవస్థానానికి చెందిన వైజయంతి కల్యాణ మండపంలో విందు ఏర్పాట్లు చేశారు. ఆహార పదార్ధాలను ఆలయ అన్నదాన సిబ్బందితో తయారు చేయించడం వివాదానికి దారితీసింది.ఎలాంటి అద్దె చెల్లించకుండా కల్యాణ మండపాలను ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి.
వేలాది మందికి వంటలు చేసే క్రమంలో ముగ్గురు సిబ్బందికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఆ సమాచారం బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. దేవస్థానాలను పార్టీ కార్యక్రమాలు, జన్మదిన వేడుకలకు వాడుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.