బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. నేటితో నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి. సోమవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి దుర్గమ్మ మహిషాసురమర్ధినిగా దర్శనమిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం అమ్మవారిని రాజరాజేశ్వరీదేవిగా అలంకరించనున్నారు. వేలాది మంది అమ్మవారి భక్తులు కాలినడకన కొండకు చేరుకుని అమ్మవారిని దర్శించుకుని తరిస్తున్నారు.
ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు 2గంటల పాటు అమ్మవారి దర్శనాలు నిలిపివేయనున్నారు.ఒకే రోజు అమ్మవారు రెండు రూపాల్లో దర్శనం ఇవ్వనుండటంతో, మధ్యాహ్నం 2 గంటల పాటు దర్శనాలు నిలిపివేశారు. ఇవాళ సాయంత్రం కృష్ణా నదిలో దుర్గామల్లేశ్వరుల తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. నవరాత్రి ఉత్సవాలు ముగియనుండటంతో ఇంద్రకీలాద్రికి భవానీ భక్తుల రాక భారీగా పెరిగింది. దసరా ఉత్సవాలు ముగిసిన తరవాత కూడా రెండు రోజులు భవానీ భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.
శ్రీశైలంలో శ్రీభ్రమరాంబికాదేవి సిద్ధిదాయిని అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.ఇవాళ అశ్వవాహనంపై ఆసీనులై ఆది దంపతులు పూజలందుకొంటున్నారు. ఇవాళ రాత్రి పురవీధుల్లో శ్రీస్వామిఅమ్మవారి గ్రామోత్సవం నిర్వహించనున్నారు.