తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా (Mahuva Moitra) పార్లమెంటరీ ఐడీ దుర్వినియోగం వ్యవహారం రాజకీయ రచ్చకు దారితీసింది.ఆమె పార్లమెంటరీ ఐడిని దుబాయ్ నుంచి కొందరు వ్యక్తులు ఉపయోగించారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగింది. మహువా డబ్బు తీసుకుని అదానీపై ప్రశ్నలు వేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై విచారణ జరుగుతోంది. మహువా వ్యవహారంతో తృణమూల్ కాంగ్రెస్ ఇరకాటంలో పడింది. విచారణ పూర్తైన తరవాతే మహువాపై తగిన చర్యలుంటాయని ఆ పార్టీ సీనియర్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ తెలిపారు.
పార్లమెంటులో ప్రశ్నలు వేయడానికి వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి విలువైన బహుమతులు, డబ్బు తీసుకుందని ఎంపీ మహువా మొయిత్రాపై వెల్లువెత్తిన ఆరోపణలు సంచలనంగా మారాయి. దీనిపై విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే లోక్సభ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాశారు. ఈ వ్యవహారంపై పార్లమెంటరీ ప్యానెల్ విచారణ జరుపుతోంది.
మహువాపై వస్తున్న ఆరోపణలపై పార్టీ అధిష్టానం వివరణ కోరింది. ఆమె వివరణ ఇచ్చారు. పార్లమెంటరీ ప్యానెల్ విచారణ జరుపుతోంది. అది పూర్తవ్వనివ్వండి, ఆ తరవాత పార్టీ అధిష్టానం తగిన నిర్ణయం తీసుకుంటుందని తృణమూల్ రాజ్యసభ సభ్యుడు ఓబ్రెయిన్ తెలిపారు. మహువా వ్యవహారంలో తృణమూల్ మౌనం పాటించడంపై బీజేపీ మండిపడుతోంది. తప్పు జరిగింది కాబట్టే ఆ పార్టీ మౌనం వహిస్తోందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. మహువా అవినీతి నిజమని తేలినా ఆ పార్టీ అధిష్టానం ఎందుకు ఆమెను పార్టీ నుంచి తొలగించడం లేదని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.