విద్యార్థుల
విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. గౌతమీ గోదావరిలో నలుగురు యువకులు(Four students drown) ప్రమాదవశాత్తు నీటమునిగి చనిపోయారు. ఈ
ఘటన కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గోపులంక దగ్గర చోటుచేసుకుంది. ముమ్మర గాలింపు
తర్వాత నలుగురు మృతదేహాలను పోలీసులు వెలికి తీశారు.
పశ్చిమ
గోదావరి జిల్లా తణుకుకు చెందిన ఏడుగురు మిత్రులు, మూడు బైక్ లపై గోపులంక పుష్కర
ఘాట్ వద్దకు చేరుకున్నారు తన పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులతో గడిపేందుకు
వచ్చిన హనుమకొండ కార్తిక్(21) నదిలోకి దిగాడు. అతను మునిగిపోతుండటంతో మిగతా
మిత్రులు గమనించారు. మద్దెన ఫణీంద్ర(21), పెండ్యాల బాలాజీ(21), తిరుమలరావు రవితేజ(21)
కార్తిక్ ను రక్షించేందుకు వీరు కూడా నదిలోకి దూకారు. కానీ నీటి ప్రవాహానికి వీరు
కూడా కొట్టుకుపోయారు.
సలాది దుర్గమహేశ్, కొమ్మిరెడ్డి చైతన్య కూడా నదిలోకి దిగి తమ
స్నేహితులను రక్షించే ప్రయత్నం చేశారు. కానీ సాధ్యం కాలేదు. వెంటనే వెనక్కి
వచ్చేయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. వీరితో పాటు వచ్చిన మరో యువకుడు నేదూరు
భానుప్రసాద్ ఘటనతో భయపడి ఎటో వెళ్ళిపోయాడని స్థానికులు చెబుతున్నారు.
సమాచారం అందుకున్న పోలీసు, రెవెన్యూ సిబ్బంది గజఈతగాళ్లతో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. తీవ్ర
గాలింపు అనంతరం నలుగురి మృతదేహాలు దొరికాయి.