ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సమస్యలపై భారత్ ఎన్నడూ యుద్ధాన్ని చూడలేదని భాగవత్ వ్యాఖ్యానించారు. మనదేశం అన్ని సంప్రదాయాలు, మతాలను గౌరవిస్తుందని ఆయన అన్నారు. ఇజ్రాయెల్ హమాస్ తరహా యుద్ధాలను భారత్ ఎన్నడూ చూడలేదని భాగవత్ వ్యాఖ్యానించారు. ఇలాంటి సమస్యలపై మనం యుద్ధం చేయమని నాగపూర్‌లో జరిగిన ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో గుర్తుచేశారు.
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ వ్యతిరేకిస్తుందని, ఇలాంటి కష్ట సమయంలో భారత్ ఇజ్రాయెల్‌కు అండగా నిలుస్తుందని భారత ప్రధాని మోదీ కొద్ది రోజుల కిందట ఎక్స్‌లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ దాన్ని ఖండిస్తుందని ప్రధాని మోదీ ప్రకటించారు. ఇజ్రాయల్‌పై హమాస్ దాడిని ఖండించిన ప్రధాని, గాజాలోని ఆసుపత్రిపై దాడులను కూడా తప్పుపట్టారు.
ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు జరిపిన మెరుపు దాడిలో 1400 మంది చనిపోయారు. ఇజ్రాయెల్ జరిపిన ప్రతిదాడిలో గాజాలో ఇప్పటి వరకు 4385 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరు వైపులా వేలాది మంది గాయపడ్డారు. హమాస్ ఉగ్రదాడి చేసిన, 16వ రోజూ కూడా ఇజ్రాయెల్ గాజాపై భీకరదాడులు కొనసాగిస్తోంది.