ఇజ్రాయెల్ దాడులతో ధ్వంసమైన గాజాలోని పాలస్తీనా ప్రజలకు మానవతా సాయం చేసేందుకు ప్రపంచంలోని అనేక దేశాలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి (UNO) పంపిన సాయం ఈజిప్టు సరిహద్దు రఫా నుంచి గాజాకు చేరుకుంది. ఇవాళ భారత్ 6.5 టన్నుల సామగ్రిని విమానంలో పంపింది. ముఖ్యంగా గాజాలో గాయపడ్డ పాలస్తీనియన్లకు అత్యవసరమైన మందులు, శస్త్రచికిత్స పరికరాలు, గుడారాలు, నీటిని శుద్దిచేసే మాత్రలు పంపినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్ఛీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
వైమానిక దళానికి చెందిన సీ 17 విమానంలో 6.5 టన్నుల సామగ్రిని ఈజిప్టులోని ఈఎల్ అరిష్ విమానాశ్రయానికి తరలిస్తారు. అక్కడ నుంచి రఫా సరిహద్దు గుండా గాజాకు తరలించి బాధితులకు సహాయం చేయనున్నారు. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో గాజాలోని రహదారులు ధ్వంసం కావడంతో మానవతాసాయం అందించడం కష్టంగా మారింది. పాలస్తీనా పౌరులకు భారత్ మానవతాసాయం అందిస్తూనే ఉంటుందని విదేశాంగ శాఖ ప్రకటించింది.