అమెరికాకు చెందిన పెంటగాన్ సంచలన నివేదిక విడుదల చేసింది. చైనా వద్ద 500 అణు వార్హెడ్లు (china nuclear war heads)ఉన్నాయని తెలిపింది. 2021తో పోల్చితే వాటి సంఖ్య 100 పెరిగినట్లు పెంటగాన్ నివేదికలో వెల్లడించింది. 2030 నాటికి డ్రాగన్ వద్ద అణు వార్హెడ్ల సంఖ్య 1000 దాటే అవకాశముందని అంచనా వేసింది.
చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వద్ద 300 బాలిస్టిక్ క్షిపణులు సొరంగాల్లో సిద్దంగా ఉన్నాయని కూడా పెంటగాన్ నివేదిక ద్వారా తెలుస్తోంది. వాటిని చైనాలోని మూడు కీలక ప్రాంతాల్లో మోహరించినట్లు వెల్లడించింది. క్షిపణులను మోహరించడానికి చైనా 2022లో భూగర్భ బొరియలు నిర్మించినట్లు పెంటగాన్ తెలిపింది.
పలు దేశాల్లో చైనా మిలటరీ బేస్‌లు ఏర్పాటు చేసే ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు పెంటగాన్ నివేదికలో వెల్లడించింది. బర్మా, థాయ్‌లాండ్, యూఏఈ, ఇండోనేషియా, నమీబియా, కెన్యా, నైజీరియా, బంగ్లాదేశ్, పపువా న్యూగినియా, సాల్మన్ ఐలాండ్స్, తజకిస్థాన్ దేశాల్లో చైనా ఇప్పటికే లాజిస్టిక్స్ కేంద్రాలు ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు పెంటగాన్ తెలిపింది.
భారత్, చైనా సరిహద్దు ప్రాంతం వాస్తవాధీన రేఖ వద్ద కూడా పెద్ద ఎత్తున నిర్మాణాలు చేస్తున్నట్లు పేర్కొంది. భూగర్భ గిడ్డంగులు, రోడ్లు, విమానాశ్రయాలు, హెలిఫ్యాడ్లు నిర్మిస్తోందని పెంటగాన్ ప్రకటించింది. డోక్లాం వద్ద కూడా భూగర్భ స్టోరీజీ నిర్మాణాలు సాగుతున్నట్లు పెంటగాన్ నివేదిక స్పష్టం చేస్తోంది.