కృష్ణా జిల్లా కంకిపాడులోని మణప్పురం గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలో గత సోమవారం భారీ ఛోరీ జరిగిన సంగతి తెలిసిందే. మణప్పురం బ్రాంచ్ మేనేజర్ (Manappuram Gold )గా చేస్తోన్న రెడ్డివెంకట పావని, మరొకరితో కలసి ఈ ఛోరీకి పాల్పడినట్లు సీసీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. ఆరు రోజుల్లోనే పోలీసులు కేసును ఛేదించి, పావనిని అదుపులోకి తీసుకున్నారు.
గుడివాడ రూరల్ మండలం లింగవరం గ్రామానికి చెందిన రెడ్డివెంకట పావని ఫిబ్రవరిలో కంకిపాడు మణప్పురం శాఖకు బదిలీపై వచ్చింది. భర్తతో మనస్పర్థలు రావడంతో ఆమె కంకిపాడులో విడిగా ఉంటోంది. ఇటీవల కృతివెన్నుకు చెందిన వ్యక్తితో సన్నిహితంగా మెలుగుతోంది. అతడు ఓ ప్రైవేటు పాఠశాల నడుపుతున్నాడు. ఇద్దరూ విలాసవంతమైన జీవితానికి అలవాడు పడటంతో అప్పుల పాలయ్యారు.ఇద్దరూ కలసి ఎలాగైనా బంగారం కొట్టేయాలని ప్రణాళిక వేసుకున్నారు. ఈనెల 16న పావని ఛోరీకి పాల్పడింది. అదే రోజు రాత్రి సన్నిహితుడితో కలసి పరారైంది. కొంత బంగారం తీసుకుని బంధువులతో కలసి శిర్డి వెళ్లింది.
ఆమె ఫోను స్విఛాఫ్ చేసి బంధువుల ఫోన్ నుంచి తన కుటుంబ సభ్యులతో మాట్లాడుతోందని పోలీసులు ట్రాక్ చేశారు. ప్రత్యేక గాలింపు బృందం శిర్డిలో పావనిని అదుపులోకి తీసుకుని కంకిపాడు తరలించారు. ఛోరీకి గురైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.