ప్రపంచ కప్ క్రికెట్లో ఇంత వరకు గెలుపు రుచి చూడని శ్రీలంక జట్టు శనివారం నాడు లఖ్‌నవూ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఎట్టకేలకు నెదర్లాండ్స్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ (Netherlands) జట్టు 49.4 ఓవర్లలో 262 పరుగులకు ఆలౌటైంది. డచ్ జట్టులో సిబ్రాండ్ 82 బంతుల్లో 70 పరుగులు, వాన్‌బీక్ 75 బంతుల్లో 59 పరుగులతో రాణించారు. మదుశంక 4, రజిత 4 వికెట్లు తీసి డచ్ జట్టు స్కోరు పరిమితం చేశారు.
ఛేదనలో మొదట శ్రీలంక తడబడింది. 263 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన శ్రీలంక జట్టు 10 ఓవర్లకు రెండు కీలక వికెట్లు కోల్పోయి 56 పరుగులు మాత్రమే సాధించింది. లంక జట్టులో నిశాంక 52 బంతుల్లో 54 పరుగులు, అసలంక 44, ధనంజయ 30 పరుగులతో రాణించారు. సమరవిక్రమ 107 బంతుల్లో 91 పరుగులు సాధించి జట్టును విజయపథంలో నడిపించారు. సమరవిక్రమను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ప్రకటించారు.