Sikh teen beaten
అమెరికాలోని
న్యూయార్క్ నగరంలో ఓ సిక్కు టీనేజ్ యువకుణ్ణి ఓ అమెరికన్ చితగ్గొట్టాడు. కారణం, ఆ
యువకుడు తలపాగా ధరించి బస్సెక్కడమే. ఆ దాడిని విద్వేష చర్యగా పరిగణించి, పోలీసులు
ఆ అమెరికన్‌ను అరెస్ట్ చేసారు.
క్రిస్టోఫర్
ఫిలిప్పే న్యూయార్క్ నగరానికి చెందిన 26ఏళ్ళ దొంగ. ఒక దొంగతనం నేరం మీద రెండేళ్ళ
జైలుశిక్ష అనుభవిస్తూ, 2021 జులైలో పెరోల్ మీద విడుదలయ్యాడు. ఈ నెల 15న న్యూయార్క్‌లో
లిబర్టీ ఎవెన్యూ దగ్గర ఓ బస్సులో ప్రస్తుత ఘటన చోటు చేసుకుంది.
న్యూయార్క్
పోలీసుల కథనం ప్రకారం ఫిలిప్పే ఒక బస్సులో ప్రయాణిస్తున్నాడు. అదే బస్సులో 19ఏళ్ళ
సిక్కు యువకుడు కూడా ప్రయాణిస్తున్నాడు. అతను తలపాగా ధరించి ఉన్నాడు. ఫిలిప్పే ఆ
సిక్కు దగ్గరకు వెళ్ళి, అతని తలపాగా గురించి ‘మా దేశంలో ఇలాంటివి ధరించము’ అని
హేళనగా మాట్లాడాడు. దాన్ని తీసేయమంటూ హెచ్చరించాడు.
ఫిలిప్పే అక్కడితో
ఆగలేదు. ఆ సిక్కు యువకుడి ముఖం మీద, వీపు మీద, తల వెనుక పిడిగుద్దులు గుద్దాడు. ఆ
యువకుడికి బలమైన దెబ్బలు తగిలాయని, కొన్నిచోట్ల చర్మం చీరుకుపోయిందనీ పోలీసులు
వెల్లడించారు. ఆ తర్వాత ఆ యువకుడి తలపాగా లాగి పారేయడానికి ప్రయత్నించాడు. చివరికి
బస్సులోనుంచి దిగి పారిపోయాడు.
అకస్మాత్తుగా
జరిగిన ఆ ఘటన సిక్కు యువకుణ్ణి కలచివేసింది. భయం, కోపంతో ఆ యువకుడు వణికిపోయాడు.
అతను తీవ్రమైన ఉద్వేగానికి లోనయ్యాడని స్థానిక సిఖ్ కమ్యూనిటీ కార్యకర్త జప్‌నీత్
సింగ్ చెప్పాడు. ’అతను మాత్రమే కాదు, అతని కుటుంబం అంతా భయపడిపోయింది. అతనికి
తగిలిన గాయాలు ఎంత తీవ్రమైనవంటే అతను కోలుకోడానికి సుమారు వారం రోజులు పడుతుంది’
అని జప్‌నీత్ వివరించాడు.
క్రిస్టోఫర్
ఫిలిప్పేకు నేరచరిత్ర ఉందనీ, గతంలో పలుమార్లు శిక్ష అనుభవించాడనీ, ప్రస్తుతం
పెరోల్ మీద బైట ఉన్నప్పటికీ అతని ప్రవర్తనలో ఏ మార్పూ రాలేదనీ న్యూయార్క్ పోలీసులు
వెల్లడించారు.