ఇజ్రాయెల్ భీకర దాడులతో గాజా ప్రాంతం కకావికలమైంది. గాజా ప్రజలకు తాగునీరు, ఆహారం, మందులు, విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో వారికి మానవతాసాయం చేసేందుకు ఐక్యరాజ్యసమితి ముందుకు వచ్చింది. అమెరికా అధ్యక్షుడు ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా, ఈజిప్ట్ అధ్యక్షునితో ఫోన్లో చర్చలు జరిపారు. మానవతాసాయం కోసం రఫా సరిహద్దు తెరవాలని ఈజిప్టు అధ్యక్షుడిని కోరడంతో ఆయన అంగీకరించారు. నేటి నుంచి రఫా సరిహద్దు నుంచి గాజా ప్రజలకు అవసరమైన ఆహారం, మందుల సరఫరా మొదలైంది.
ఐక్యరాజ్యసమితి సేకరించిన మందులు, ఆహారంతో కూడిన ట్రక్కులు ఈజిప్టు సరిహద్దు రఫా నుంచి గాజాలోకి ప్రవేశించాయి. అక్కడ నుంచి గాజాలోని వివిధ ప్రాంతాలకు వాటిని తరలించి పంపిణీ చేయనున్నారు.
శుక్రవారం సాయంత్రానికే 200 ట్రక్కుల్లో 3 వేల టన్నుల సామగ్రి రఫా సరిహద్దుకు చేరుకుంది. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో రోడ్లు దెబ్బతినడంతో సహాయ సామగ్రి తీసుకెళ్లే ట్రక్కుల రాకపోకలకు అనుగుణంగా మరమ్మతులు చేశారు. గాజాను ఇజ్రాయెల్ దిగ్బంధం చేయడంతో కేవలం రఫా సరిహద్దు నుంచి మాత్రమే సాయం అందే అవకాశముంది. ఇజ్రాయెల్ దాడులతో గాజాలో 10 లక్షల మంది నిరాశ్రయులైనట్లు తెలుస్తోంది. వారికి మానవతాసాయం అందించేందుకు పలు దేశాలు ముందుకు వస్తున్నాయి.