పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి లంచాలు
తీసుకున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా
మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఆమెపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే కొత్తగా మరికొన్ని
ఆరోపణలు చేశారు. ఆమె లోక్‌సభ ఐడీని దుబాయ్ నుంచి వేరొకరు వినియోగించినట్లు
తెలిసిందని చెప్పారు.
ఎంపీ మహువా మొయిత్రా భారత్‌లో ఉండగానే ఆమె లోక్‌సభ
ఐడీని దుబాయ్ నుంచి మరొకరు వినియోగించారని ఆరోపించారు. ఆ సమాచారాన్ని నేషనల్
ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ దర్యాప్తు సంస్థలకు వెల్లడించినట్లు ఆన తన ఎక్స్ అకౌంట్లో
ట్వీట్ చేసారు.
‘‘ఓ ఎంపీ డబ్బుల కోసం దేశ భద్రతను
తాకట్టు పెట్టారు. ఆ ఎంపీ భారత్‌లో ఉండగానే.. ఆ వ్యక్తి పార్లమెంట్ ఐడీని దుబాయ్
నుంచి తెరిచారు. ఆ సమాచారాన్ని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, దర్యాప్తు
సంస్థలకు ఇచ్చింది. ప్రధాని సహా ఆర్థికశాఖ, కేంద్ర సంస్థలు..
మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఎన్ఐసీని వినియోగిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్,
విపక్షాలూ దీనిపై ఇప్పటికీ రాజకీయం చేయాలనుకొంటున్నాయా? దీనిపై నిర్ణయం ప్రజలదే’’ అని నిశికాంత్ దూబే తన ట్వీట్లో ఆరోపణలు చేసారు.
అదానీ గ్రూప్‌ను, ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకునేందుకు ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్
హీరానందానీ నుంచి మహువా 2 కోట్ల రూపాయలు, ఐఫోన్ వంటి ఖరీదైన
బహుమతులు తీసుకున్నారని, దూబే ఇటీవలే లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాసారు. ఆ వ్యవహారం ఇప్పుడు
లోక్‌సభ నైతిక ప్రవర్తనా నియమావళి కమిటీ ముందుకు చేరింది. దర్శన్ హీరానందానీ
ఆఫిడవిట్ తమకు అందినట్లు ఎథిక్స్ కమిటీ తెలియజేసింది.
హీరానందానీ అఫిడవిట్‌లోని కొన్ని విషయాలు బహిర్గతం కావడం
చర్చనీయాంశమైంది. వ్యాపారవేత్త గౌతమ్ అదానీయే లక్ష్యంగా పార్లమెంటులో
ప్రశ్నలడగటానికి మొయిత్రా లోక్‌సభ ఐడీని ఉపయోగించుకున్నానని అఫిడవిట్లో హీరానందానీ
ఒప్పుకున్నారని వార్తలు వచ్చాయి. వాటిపై మహువా తీవ్రంగా స్పందించారు. అదంతా ప్రధానమంత్రి
కార్యాలయం చేసిన కుట్ర అని ఆరోపించారు. పీఎంఓ అధికారులే హీరానందానీపై ఒత్తిడి పెట్టి, తెల్లకాగితంపై సంతకం చేయించుకుని, తమకు కావలసినట్లు రాసుకున్నారనీ ఆమె మండిపడ్డారు.