కరవుతో అల్లాడిపోతోన్న ఏపీ ప్రజలకు భారత వాతావరణ శాఖ శుభవార్త తీసుకువచ్చింది. నేటి నుంచి తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈశాన్య రుతుపవనాలు ప్రారంభం అయ్యాయని ఐఎండి తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. కొమోరిన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో, దక్షిణ, మధ్య బంగాళాఖాతంలో ఈశాన్య గాలులు బలపడి మధ్య ట్రోపో ఆవరణం వరకు విస్తరించాయని ఐఎండీ తెలిపింది.
ఆగ్నేయ, దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతోందని ఐఎండి ప్రకటించింది.
ఇవాళ ఏర్పడిన అల్పపీడనం, రేపటికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశముందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. వాయుగుండం ఉత్తర ఈశాన్య దిశగా బంగ్లాదేశ్, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమబెంగాల్ తీరాల వైపు పయనించి రానున్న 3 రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించింది.
అల్పపీడనం, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాబోవు మూడు రోజులు ఉత్తర కోస్తా ఆంధ్రా, యానాంలలో తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశముంది. దక్షిణ కోస్తాంధ్రా, రాయలసీమ జిల్లాల్లోనూ రేపు, ఎల్లుండి ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశ ముందని ఐఎండీ ప్రకటించింది.