తీవ్ర కరవు పరిస్థితులతో పంటలు ఎండిపోతోన్నా సీఎం జగన్మోహన్రెడ్డి రైతులను పట్టించుకోవడం లేదని ఏపీ బీజేపీ నేత పాతూరి నాగభూషణం విరుచుకుపడ్డారు.
ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వివరిస్తూ పంటలు ఎండిపోయిన వీడియోలను ఆయన విజయవాడ బీజేపీ కార్యాలయంలో మీడియాకు ప్రదర్శించారు.
రాష్ట్రంలో 24 లక్షల ఎకరాల్లో అసలు పంటలు వేయలేదని, పంటలు సాగు చేసిన ప్రాంతాల్లో వర్షాలు లేక, సాగునీరు లేక ఎండిపోతోన్నా సీఎం జగన్మోహన్రెడ్డి, వ్యవసాయమంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి నోరు తెరవడం లేదని పాతూరి నాగభూషణం విమర్శించారు. గతంలో కూడా అనేక కరవులు వచ్చాయని అయితే ఇలాంటి కరవు తాను ఎన్నడూ చూడ లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి కరవు వచ్చినా కృష్ణా డెల్టాలో ఖరీఫ్ వరి పంట ఎండిపోలేదని, కానీ ఈ ఏడాది లక్షలాది ఎకరాల్లో పంట ఎండిపోతోందని ఆయన గుర్తుచేశారు.
పాలకుల అవినీతి రాష్ట్రానికి శాపంగా మారిందని, పులిచింతల ప్రాజెక్టులో నీరున్నా కృష్ణా డెల్టాకు విడుదల చేయడం లేదని పాతూరి నాగభూషణం విమర్శించారు.
కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు.సాగునీరు విడుదల చేయకపోవడంతో వేలాది ఎకరాల్లో వరి పంట ఎండిపోయే దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీశైలం నీటిని తెలంగాణా ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తికి వాడుకుని, నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా నీటిని తరలించుకుపోతున్నా సీఎం జగన్‌రెడ్డి నోరుమెదపడం లేదని పాతూరి విమర్శించారు.
ప్రభుత్వ విధానాలు సక్రమంగా లేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. అన్నదాతకు అప్పు పుట్టే పరిస్థితి లేకుండా చేశారని ఎద్దేవా చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు రైతుల వద్దకు వెళ్లి మాట్లాడలేని దుస్థితిలో ఉన్నారని పాతూరి నాగభూషణం విమర్శించారు. పంటలు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.