తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక
బడ్జెట్లోనుంచి 1శాతం నిధులను తిరుపతి నగరం అభివృద్ధి కోసం కేటాయించాలన్న టీటీడీ పాలకమండలి
ప్రతిపాదనను రాష్ట్రప్రభుత్వం తిరస్కరించింది. విశ్వహిందూ
పరిషత్, ఇతర హిందూ సంఘాలు, భారతీయ జనతా పార్టీ ఆందోళన ఫలించింది.
తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయం
దేశంలోనే అత్యధిక ప్రజాదరణ కలిగిన దేవాలయాల్లో ప్రధానమైనది. దేశం నలుమూలల నుంచే
కాక, విదేశాల నుంచి సైతం వేలాదిగా భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుంటారు,
మొక్కులు తీర్చుకుంటారు, కానుకలు సమర్పించుకుంటారు. వాటికన్ తర్వాత ప్రపంచంలోనే అత్యధిక
ఆదాయం కలిగిన ఆలయం తిరుమల బాలాజీ మందిరం. ఆ ఆదాయాన్ని హిందూ ధార్మిక
కార్యక్రమాలకు, హిందూ జనజాగరణకు మాత్రమే ఉపయోగించాలని చట్టం చెబుతోంది.
తిరుమల తిరుపతి దేవస్థానాల పాలకమండలి
ఇటీవల ఒక ఆలోచన చేసింది. తిరుమల స్వామివారికి వచ్చే కానుకల నుంచి తిరుపతి నగరం
అభివృద్ధికి నిధులను కేటాయించాలని భావించింది. తిరుమల తిరుపతి దేవస్థానాల వార్షిక
బడ్జెట్లో 1శాతం నిధులను తిరుపతి నగరాభివృద్ధికి వినియోగించాలని ఆలోచించింది. ఆ మేరకు
రాష్ట్రప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించింది.
స్థూలంగా చూడడానికి ఈ ప్రతిపాదన
బాగానే ఉన్నా, దీనివెనుక ఉన్న ఆలోచనలను విశ్లేషిస్తే అసలు బాగోతం అర్ధమవుతుంది. ఒక
నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత స్థానిక నగరపాలక సంస్థది, ఇంకా
రాష్ట్రప్రభుత్వానిదీ అవుతుంది. దానికోసం నిధులను సమకూర్చుకోవడం వారి విధే.
తిరుమలకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడం పేరిట ఆ ఆలయ నిధులను తిరుపతి
అభివృద్ధికి వాడతామని తితిదే పాలకమండలి చెప్పింది. నిజానికి తిరుపతికి భక్తుల
రాకపోకల వల్ల స్థానికంగా రకరకాల వాణిజ్య వ్యాపార కార్యకలాపాలు జరుగుతున్నాయి.
తిరుపతి నగర ఆదాయంలో మెట్టువాటా అటువంటి ఆదాయాల ద్వారా వస్తున్నదే. ఇక స్థానికంగా
రహదారుల నిర్మాణం, పర్యవేక్షణ వంటి పనులను ప్రభుత్వం చూసుకోవాలి. అప్పటికీ రైల్వే
వసతులు, సౌకర్యాలు కేంద్రప్రభుత్వం చూసుకుంటుంది. అలాగే, తిరుపతి నగరాన్ని ‘స్మార్ట్
సిటీ’గా గుర్తించి కేంద్రం ప్రత్యేక నిధులు సమకూరుస్తోంది కూడా. అలాంటప్పుడు
రాష్ట్రప్రభుత్వం తనవంతుగా ఏం చేస్తోంది? అన్న ప్రశ్న తలెత్తుతుంది.
స్వామివారి నిధులను ఆధ్యాత్మిక కార్యకలాపాలకు,
హిందూ ధర్మ పరిరక్షణకు మాత్రమే వాడాల్సి ఉంది. తిరుమల వేంకటేశ్వరస్వామికి కానుకలు,
మొక్కుబడులు చెల్లించుకునే భక్తులు హిందువులే. వారు స్వామి ఆలయాన్ని అభివృద్ధి
చేయడం, హిందూధర్మాన్ని ప్రచారం చేయడం వంటి కార్యకలాపాల కోసం స్వామికి తమ
ఇష్టానుసారం మనస్ఫూర్తిగా కానుకలు సమర్పించుకుంటూ ఉంటారు. తిరుమల తిరుపతి
దేవస్థానాలు ఆ నిధులను రాష్ట్రవ్యాప్తంగా
హిందూధర్మ జనజాగరణ, జీర్ణాలయాల పునరుద్ధరణ, చిన్నచిన్న గుడులకు ధూపదీపనైవేద్యాలకు నిధుల
కేటాయింపు వంటి కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నాయి. వాటిపట్ల హిందూభక్తుల్లో ఎలాంటి
అసంతృప్తీ లేదు. తితిదే ఉద్యోగుల జీతభత్యాలు, తిరుమలలో వసతులు, రాష్ట్రవ్యాప్త
ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భక్తిఛానెల్ నిర్వహణ వంటి పలు కార్యక్రమాలకు ఈ కానుకల
ద్వారా వచ్చే నిధులను ఉపయోగించుకుంటున్నా వాటిని ఎవరూ వ్యతిరేకించలేదు. అయితే,
తిరుపతి అభివృద్ధికి హిందూభక్తులు ఇచ్చే కానుకల వల్ల సమకూరే నిధులను వినియోగించడం
మాత్రం హిందూ భక్తుల విమర్శలకు గురయ్యింది.
తిరుమల తిరుపతి దేవస్థానాల పాలకమండలి
ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయి కొన్ని దశాబ్దాలయింది. అధికారంలో ఎవరుంటే
వారు తమతమ రాజకీయ అవసరాలకు అనుగుణంగా తితిదే పాలకమండలిని మార్చేస్తున్నారు.
ఇప్పటికే తితిదే ఉద్యోగుల్లో అన్యమతస్తుల అంశం అపరిష్కృతంగా ఉండిపోయింది. భక్తికి,
భక్తులకు ప్రాధాన్యం ఉండాల్సిన ఆలయంలో అధికారులు, రాజకీయ నాయకుల ప్రాబల్యం తప్ప
మరేమీ మిగల్లేదు. స్వామి కైంకర్యం కోసం భక్తులు ఇచ్చుకుంటున్న కానుకలను
దిగమింగుతున్నా హిందూసమాజం ఏమీ చేయలేని పరిస్థితి. ఇలాంటి తరుణంలో తిరుపతి
అభివృద్ధి పేరుతో నిధుల దారిమళ్ళింపును చట్టబద్ధం చేయాలని తితిదే పాలకమండలి
తీసుకున్న నిర్ణయం తీవ్ర విమర్శలకు లోనయింది.
హిందూ జనజాగరణ కోసం కృషి చేస్తున్న
విశ్వహిందూపరిషత్, ఇతర హిందూ సంఘాలు, భారతీయ జనతా పార్టీ… తితిదే పాలకమండలి ఆలోచనపై
ఆందోళన వ్యక్తం చేసాయి. విశ్వహిందూ పరిషత్ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అన్ని
జిల్లాలలోనూ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. వివాదాస్పద ప్రతిపాదనను
పాలకమండలి ఉపసంహరించుకోవాలంటూ జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించేందుకు
సన్నద్ధమయ్యాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోనూ పెద్దసంఖ్యలో హిందువులు నిరసనలకు
సిద్ధమయ్యారు. భారతీయ జనతా పార్టీ కూడా తితిదే ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ
ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమైంది.
ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది.
తితిదే పాలకమండలిని అడ్డం పెట్టుకుని తిరుమల వేంకటేశ్వర స్వామికి భక్తులు కైంకర్యం
చేసిన నిధులను కాజేయడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న అపఖ్యాతి వస్తుందన్న
విషయాన్ని అర్ధం చేసుకుంది. దాంతో తితిదే పాలకమండలి ప్రతిపాదనను తిరస్కరించినట్లు
ప్రకటించింది. ఆ మేరకు రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
కరికాల్ వలవేన్ తితిదే కార్యనిర్వాహక అధికారికి మెమో పంపించారు.
రాష్ట్రప్రభుత్వ నిర్ణయంతో విశ్వహిందూ
పరిషత్ ఇవాళ చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని రద్దు చేసుకుంది. పరిషత్ ఆంధ్రప్రదేశ్
ఉత్తర ప్రాంత కార్యదర్శి తనికెళ్ళ సత్య రవికుమార్ ఆ మేరకు ఒక ప్రకటన విడుదల
చేసారు.
రాష్ట్రప్రభుత్వ నిర్ణయం స్వామివారి
భక్తులు, హిందూ సంస్థలు సాధించిన ఘనవిజయమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర
ఉపాధ్యక్షులు ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తితిదే పాలక మండలి ఇప్పటికైనా
శ్రీవారి నిధుల విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు పీఠాధిపతులు, హిందూ సమాజంలో
పెద్దలతో సంప్రదింపులు జరిపిన తర్వాతనే ఏదైనా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసారు.