రోదసిలోకి మానవులను పంపించడానికి
ఉద్దేశించిన గగన్‌యాన్ ప్రాజెక్టుకు సంబంధించిన పరీక్షల్లో మొట్టమొదటి టెస్ట్‌ఫ్లైట్
విజయవంతమయింది. ఈ ఉదయం చేపట్టిన ఈ పరీక్షకు మొదట్లో చిన్న అవాంతరం కలిగినా, దాన్ని
శాస్త్రవేత్తలు అధిగమించారు.
భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ ఇస్రో (ISRO), రోదసిలోకి మానవులను పంపించేందుకు చేపట్టిన గగన్‌యాన్ ప్రాజెక్టులో
భాగంగా మొదట 20 పరీక్షలు చేయాలని ప్రణాళిక రచించింది. వాటిలో మొదటిదైన మానవరహిత
పరీక్షా ప్రయాణ (Unmanned Test Flight) ప్రయోగం ఇవాళ
చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని
పరిశోధనా కేంద్రం నుంచి ఈ ‘ఫ్లైట్ అబార్ట్ టెస్ట్’ నిర్వహించారు. వాహనంలోని ‘క్రూ
ఎస్కేప్ సిస్టమ్’ సామర్థ్యాన్ని పరీక్షించడం ఈ ప్రయోగం లక్ష్యం. అంతరిక్షంలోకి
వెళ్ళిన వ్యోమగాములు అత్యవసర పరిస్థితుల్లో ఈ ‘క్రూ ఎస్కేప్ సిస్టమ్’ను
ఉపయోగించుకుని బైటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక రాకెట్ లాంచ్ తర్వాత అది
బంగాళాఖాతంలో సురక్షితంగా దిగే అంశాన్ని కూడా ఈ ప్రయోగంలో పరీక్షించారు.
టెస్ట్ వెహికిల్ డి1 ప్రయోగం శ్రీహరికోటలోని
మొదటి లాంచ్‌ప్యాడ్ నుంచి ఉదయం 8 గంటలకు చేపట్టడానికి ఏర్పాట్లు చేసారు. అయితే
దాన్ని 8.45కు మార్చారు. అయితే లాంచ్‌కు సరిగ్గా 5 సెకన్ల ముందు కౌంట్‌డౌన్
నిలిచిపోయింది. ఆ అవాంతరానికి కారణాలను శాస్త్రవేత్తలు కనుగొని, సరిచేసారు. 10
గంటలకు ప్రయోగాన్ని చేపట్టారు.
ఫ్లైట్ అబార్ట్ టెస్ట్ విజయవంతం
అయింది. టెస్ట్ వెహికిల్ డీ-1 విజయవంతంగా గాల్లోకి లేచింది. మరికొద్దిసేపట్లోనే
క్రూ ఎస్కేప్ మోడ్యూల్ బంగాళాఖాతంలో సురక్షితంగా, క్షేమంగా దిగింది. దాంతో నేటి
పరీక్ష విజయవంతంగా పరిపూర్తి అయింది.
మానవులను అంతరిక్షంలోకి తీసుకువెళ్ళే
‘మిషన్ గగన్‌యాన్’ ప్రయోగాన్ని 2024లో చేపడతారు. 2035కల్లా భారత్ అంతరిక్షంలో సొంత
స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.