బెజవాడ ఇంధ్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏడో రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తున్నారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మను శ్రీ లలితా త్రిపురసుందరీ దేవిగా అలంకరించారు. అమ్మవారు శ్రీచక్ర అధిష్టానశక్తిగా, పంచథాక్షరీ మహామంత్రాధిదేవతగా, ఆరాధించే భక్తులను, ఉపాసకులను అనుగ్రహిస్తున్నారు.
పరమేశ్వరుడు త్రిపురేశ్వరుడుగా, శ్రీ అమ్మవారు త్రిపురసుందరీ దేవిగా భక్తుల పూజలందుకుంటున్నారు.అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భవానీలు కాలినడకన దుర్గమ్మ సన్నిధికి చేరుకున్నారు. అమ్మవారి దర్శనం కోసం కిలోమీటరు మేర క్యూ లైన్లలో వేచి ఉన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవస్థానం పాలకమండలి అన్ని ఏర్పాట్లు చేసింది.
శ్రైశైలం మహాక్షేత్రంలో దసరా మహూత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీభ్రమరాంబికా దేవి అమ్మవారు కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీస్వామి అమ్మవారు హంస వాహనంపై కొలువు దీరగా…అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పుష్పపల్లకిలో అధిరోహించి ప్రత్యేక పూజలు నిర్వహించి, హారతులిచ్చారు.