ఇటలీ
ప్రధానమంత్రి జార్జియా మెలోనీ తన భాగస్వామితో విడిపోయారు. ఆ విషయాన్ని ఆమె ఫేస్‌బుక్
ద్వారా ప్రపంచానికి వెల్లడించారు.
‘‘ఆండ్రియా
గియాంబ్రునోతో సుమారు పదేళ్ళు సాగిన నా బంధం ఇక్కడితో ముగిసింది. కొంతకాలంగా మా
దారులు విడిపోయాయి. ఆ విషయాన్ని గుర్తించాల్సిన సమయం వచ్చేసింది’’ అని మెలోనీ ఫేస్‌బుక్
పోస్ట్‌లో రాసారు.
టెలివిజన్
జర్నలిస్ట్ అయిన గియాంబ్రునో కొద్దివారాల క్రితం ఒక టీవీ షో సందర్భంగా చేసిన
వ్యాఖ్యలు మహిళలను కించపరిచేవిగా ఉన్నాయన్న విమర్శలు తలెత్తాయి. మెలోనీ,
గియాంబ్రునో జంటకు ఒక కూతురు ఉంది.
గియాంబ్రునో
తాను ప్రెజెంట్ చేసే ఒక టీవీ షో సందర్భంగా కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసాడు.
తన సహచర ఉద్యోగినులతో సామూహిక సంభోగం గురించి అశ్లీలంగా మాట్లాడాడు. వాటి ఆడియో
రికార్డులను ఆ టీవీ ప్రసారం చేసింది.
ఈ
ఆగస్టు నెలలో ఒక సామూహిక అత్యాచారం కేసు గురించి మాట్లాడుతూ గియాంబ్రునో చేసిన
వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఆ వ్యాఖ్యలను సమర్ధించుకోడానికి అతను చేసిన
ప్రయత్నాలూ ఫలించలేదు. వాటి తర్వాత ఇప్పుడు ఈ వ్యాఖ్యలతో గియాంబ్రునో నైజం మరింత
బహిర్గతమైంది.
తన భాగస్వామి చేసిన వ్యాఖ్యల ఆధారంగా
తనను అంచనా వేయవద్దని మెలోనీ ప్రకటించారు. అతని ప్రవర్తన గురించి భవిష్యత్తులో
ఎప్పుడూ ఎలాంటి ప్రశ్నలకూ జవాబు ఇవ్వబోనని కూడా మెలోనీ స్పష్టం చేసారు.